ఇదిగో బి-ఫామ్.. ఇలా ప్రతిజ్ఞ చేయండి
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు పవన్ కల్యాణ్. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని అభ్యర్థులకు సూచించారు.
అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇచ్చే విషయంలో పవన్ కల్యాణ్ స్పీడుమీదున్నాడు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల సంబరం మొదలవుతుండటంతో పవన్ కల్యాణ్ ఈరోజే అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇచ్చారు. అందర్నీ పార్టీ ఆఫీస్ కి పిలిపించి బీ ఫామ్ లు ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే కాదు ఓ పెద్ద ప్రతిజ్ఞ కూడా చేయించారు. మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో అంటూ మొదలైంది జనసేన నేతల ప్రతిజ్ఞ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తామని, పార్టీ నియమ`నిబంధనలకు కట్టుబడి ఉంటామని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు జనసేన అభ్యర్థులు. ఈ తతంగం అంతా కాస్త కొత్తగానే ఉన్నా.. పవన్ మాత్రం ఇది జనసేన మొదలు పెట్టిన కొత్త సంప్రదాయం అంటున్నారు.
పవన్ కల్యాణ్ తో సహా 21మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు వేదికపై బీ ఫామ్ లు ఇచ్చారు పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ఆయా నాయకుల ముఖ్య అనుచరులు కూడా హాజరయ్యారు. మొదటగా తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు బీ ఫామ్ ఇచ్చారు పవన్. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు నాదెండ్ల. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలని, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు పవన్ కల్యాణ్. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డామని.. ఎలాగైనా రాక్షస పాలనను అంతమొందించాలని అభ్యర్థులకు చెప్పారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని వారికి సూచించారు. శ్రీరామ నవమి రోజు బీ-ఫామ్ లు అందిచడం సంతోషంగా ఉందన్న పవన్.. రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని అడుగులు వేయించాలన్నారు.