నాదెండ్లకు బ్రేకులు పడినట్లేనా?
ఇప్పుడు పవన్ తర్వాత పార్టీలో నాగబాబే అవుతారు. పార్టీ నేతలే కాదు చివరకు నాదెండ్ల కూడా ఏ అవసరమొచ్చినా నాగబాబుతోనే మాట్లాడాలి. మొత్తానికి అన్న రూపంలో నాదెండ్లకు పవన్ చెక్ పెట్టారనే ప్రచారం మొదలైంది.
ఒక గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే ఏమిచేయాలి? సింపుల్ ఆన్సర్.. దాని పక్కనే మరో పెద్ద గీత గీస్తే సరిపోతుంది. ఇదే పద్ధతిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాటించినట్లున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీలో నాదెండ్ల మనోహర్ పైన సోదరుడు నాగబాబును తీసుకొచ్చి పెట్టారు. ఇంతకాలం పార్టీలో నెంబర్ 2 ఎవరంటే నాదెండ్లనే చెప్పేవారు. అయితే ఇప్పటినుండి నెంబర్ 2 ఎవరంటే నాగబాబు అనే చెబుతారు.
పవన్ ఎందుకిలా చేశారని అడిగితే అందుకనే అనే సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే పార్టీలో పవన్‌కు మించిన ఇమేజి నాదెండ్లకు వచ్చేస్తోంది. ఎలాగంటే పవన్ అసలు చాలామందితో టచ్‌లోనే ఉండరు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే పవన్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే పార్టీ ఆఫీస్‌కు వస్తున్నారు. పార్టీ నిర్వహణ మొత్తాన్ని నాదెండ్లకే వదిలేశారు. దాంతో ఏమైందంటే పార్టీలోని చాలామంది నేతలు ఏ అవసరం వచ్చినా పవన్‌ను కాకుండా నాదెండ్లతోనే మాట్లాడుతున్నారట.
కొన్నిసార్లు నాదెండ్ల కూడా సర్వం నేనే అనే పద్దతిలో వ్యవహరించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు నాదెండ్లను ఎవరూ పట్టించుకోలేదు. నాదెండ్ల జనసేనలో చేరిన తర్వాతే పాపులారిటి పెరిగింది. ఆయన కూడా పాపులారిటీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ నాగబాబుకు మంటగా ఉందట. పవన్ అందుబాటులో లేకపోతే నేతలు తనను కాంటాక్ట్ చేస్తారని నాగబాబు అనుకున్నారు. అయితే ఎవరు అలా చేయటంలేదట.
ఇదే విషయాన్ని పవన్‌తో నాగబాబు చెప్పినట్లు సమాచారం. దాంతో అన్నీ విషయాలను ఆలోచించుకున్న తర్వాతే హఠాత్తుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్నకు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ తర్వాత పార్టీలో నాగబాబే అవుతారు. పార్టీ నేతలే కాదు చివరకు నాదెండ్ల కూడా ఏ అవసరమొచ్చినా నాగబాబుతోనే మాట్లాడాలి. మొత్తానికి అన్న రూపంలో నాదెండ్లకు పవన్ చెక్ పెట్టారనే ప్రచారం మొదలైంది. అందుకనే కదా పెద్దలు ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అని చెప్పేది.