సీట్లు అడిగితే విరాళాల చెక్కులు రిటర్న్.. జనసేనలో ఏం జరుగుతోంది..?
జనసేన టికెట్లు ఆశించిన పలువురు పార్టీకి విరాళంగా పెద్ద మొత్తాల్లో చెక్కులిచ్చారు. ఇందులో రాజకీయ నేతలే కాదు.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల కూడా ఉన్నారు.
పొత్తులో 25 లేదా 30 సీట్లు మించి రావని తేలిపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్‌లో అసహనం పెరిగిపోతోంది. ఎవరైనా టికెట్ అడిగితే ఆగ్రహిస్తున్నారట. జనసేనలో చేరకపోయినా పార్టీకి విరాళంగా చెక్కులిచ్చినవారిలో చాలామంది టికెట్లు అడుగుతుండటంతో పవన్ చిరాకుపడి, ఆ చెక్కులు వారికి తిరిగిచ్చేయమని ఆదేశించడం ఇప్పుడు కొత్త ట్విస్ట్.
టికెట్ల కోసమే విరాళాలిచ్చారు మరి!
జనసేన టికెట్లు ఆశించిన పలువురు పార్టీకి విరాళంగా పెద్ద మొత్తాల్లో చెక్కులిచ్చారు. ఇందులో రాజకీయ నేతలే కాదు.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల కూడా ఉన్నారు. ఇలాంటి వారు చాలామంది వచ్చే ఎన్నికల్లో పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం టికెట్లు ఇమ్మని అడుగుతున్నారు. పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేలే ప్రక్రియ చివరికి వస్తుండటంతో వీరు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదేపదే పార్టీ నేతలకు తమ టికెట్ల గురించి గుర్తు చేస్తున్నారు.
ఒకే రోజు ఏడుగురికి వెనక్కి!
ఇప్పటికే పొత్తులో 25 నుంచి 30 సీట్లకు మించి చంద్రబాబు విదిల్చే పరిస్థితి లేక ఉన్న నేతలకే టికెట్లు సర్దలేక కిందామీదా పడుతున్న పవన్ కొత్తవాళ్ల డిమాండ్‌తో మరింత చిరాకు పడుతున్నారు. అందుకే పార్టీలో చేరకుండానే చెక్కులిచ్చిన వారికి వాటిని తిరిగిచ్చేయాలని పార్టీ లీడర్లను ఆదేశించారు. ఇలా మంగళవారం ఒక్కరోజే ఏడుగురికి చెక్కులు తిరిగిచ్చేసినట్లు జనసేన వర్గాల కథనం.