Telugu Global
Andhra Pradesh

జనసేన బలహీనతల్ని బయటపెట్టిన పవన్

"పోల్ మేనేజ్ మెంట్ తెలుసా..? ఆర్గనైజేషన్ బలం ఉందా..? సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం లాంటి పార్టీలతో మనం పోటీపడగలమా..?"

జనసేన బలహీనతల్ని బయటపెట్టిన పవన్
X

రాజకీయ పార్టీ అన్న తర్వాత బలాలు, బలహీనతలు అన్నీ ఉంటాయి. కానీ నాయకుడనేవాడు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి, అందర్నీ కలుపుకొనిపోవాలి, వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలవాలి. కానీ పవన్ కల్యాణ్ రాజకీయం అది కాదు. తాడేపల్లి గూడెం జెండా సభలో ఆయన చేసిన ప్రసంగం జనసైనికుల్ని పూర్తిగా నిరాశలోకి నెట్టేసింది. 24 సీట్లు మాత్రమే ఎందుకు అనే విషయాన్ని సమర్థించుకునే క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

"పోల్ మేనేజ్ మెంట్ తెలుసా..? ఆర్గనైజేషన్ బలం ఉందా..? సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం లాంటి పార్టీలతో మనం పోటీపడగలమా..? 800 నుంచి వెయ్యిమంది బూత్ లెవల్ కార్యకర్తలు మనకు ఉన్నారా..? వారందరికీ ఎంతోకొంత డబ్బులిస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా..?" అంటూ జనసేన బలహీనతల్ని బయటపెట్టుకున్నారు పవన్ కల్యాణ్. పవన్ ప్రసంగం విన్న జనసేన వీరాభిమానులు పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. జనసేనకు అవన్నీ లేవని అంటున్నారంటే అది కచ్చితంగా పార్టీ అధ్యక్షుడి వైఫల్యమే కదా..? దాన్ని పక్కనపెట్టి ఎంతసేపు జనసైనికులకు సత్తా లేదు అని విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


2019లో జనసేన సింగిల్ సీటు గెల్చుకుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎంతోకొంత బలంగా పోటీపడింది. కానీ ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టిపెట్టలేదు. ఎక్కడా ఏ నాయకుడిని ఎదగనీయలేదు. పోనీ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసినా ఈ సినిమాలో తానొక్కడినే హీరో అంటూ అందర్నీ కట్టడి చేశారు. చివరకు ఎన్నికల వేళ 24 సీట్లు తీసుకుని సరిపెట్టుకున్నారు. ఆ 24 సీట్లలో పవన్, నాదెండ్ల కోటా పోతే.. నిజంగా జనసేనకోసం కష్టపడినవారికి దక్కే సీట్లెన్ని..? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. పార్టీకోసం కష్టపడినవారికి సీట్లు లేకుండా పొత్తులతో చేతులు కట్టేసుకున్న పవన్, ఇప్పుడు పార్టీపైనే ఇలా నిందలు వేసుకున్నారు. తాను అసమర్థుడిని అని చెప్పుకోలేక, తన పార్టీ అసమర్థమైనదని, అందుకే టీడీపీతో కలవాల్సి వచ్చిందని కవర్ చేసుకున్నారు.

First Published:  29 Feb 2024 9:24 AM IST
Next Story