ఏపీ పొత్తుల్లో కొత్త కోణం.. బీజేపీ నేతలతో భేటీకోసం ఢిల్లీకి పవన్
పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీలో జరిగే భేటీల్లో పాల్గొంటారని జనసేన వర్గాలంటున్నాయి. అయితే పవన్, మనోహర్.. ఎవరెవరిని కలుస్తారు, ఏయే విషయాలపై చర్చిస్తారు అనేది మాత్రం స్పష్టంగా తేలలేదు.
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉందా లేదా అనే సందిగ్ధావస్థలో జనసేనాని ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరికింది. అయితే ఆ పెద్దలు ఎవరనే విషయం బయటకు రావడంలేదు. పవన్ కల్యాణ్ వెంట ఢిల్లీకి నాదెండ్లమనోహర్ కూడా వెళ్లారు. ఢిల్లీ పర్యటన తర్వాత దాదాపుగా ఏపీలో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పుడే ఎందుకు..?
వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్నారే కానీ, పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా ఉంది. సీట్ల విషయంలో పవన్ తో గీచి గీచి బేరాలాడుతోంది. ఇవి ఎడతెగకుండా సాగుతున్నాయి. ఈ దశలో అసలు బీజేపీ సంగతేంటో తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు పవన్. ఏపీలో ఏ ఉప ఎన్నికలోనూ జనసేనకు బీజేపీ అవకాశం ఇవ్వలేదు. సొంతగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేనతో సంప్రదించకుండానే అభ్యర్థుల్ని నిలబెట్టి పరువు తీసుకుంది. జనసేన మాత్రం సైలెంట్ గా టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు పవన్ పై అక్కసు వెళ్లగక్కారు. కానీ బయటపడటంలేదు. ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనతో.. బీజేపీతో స్నేహం ఉందా లేదా అనేది తేలిపోతుంది.
ఆదివారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వెళ్లిన పవన్, ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీలో జరిగే భేటీల్లో పాల్గొంటారని జనసేన వర్గాలంటున్నాయి. అయితే పవన్, మనోహర్.. ఎవరెవరిని కలుస్తారు, ఏయే విషయాలపై చర్చిస్తారు అనేది మాత్రం స్పష్టంగా తేలలేదు. ఏపీలో టీడీపీతో కలిసేది లేదని బీజేపీ నేతలంటున్నారు. పవన్ కి మాత్రం రెండు పార్టీలు కావాలి. ఈ సందిగ్ధావస్థకు తెరపడుతుందా మరికొన్నాళ్లు సస్పెన్స్ కొనసాగుతుందా.. వేచి చూడాలి.