పవన్ పై పరువునష్టం కేసు.. కోర్టులో సీన్ 'రివర్స్'
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల బాధితురాలైన వాలంటీర్ మనోవేదనకు గురయ్యారని ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే కోర్టు ఈ ఫిర్యాదుని విచారణకు స్వీకరించకుండా వాపసు చేయడం విశేషం.
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై పరువునష్టం కేసు వేయడానికి సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. అయితే ఆలోగా పవన్ పై ఓ ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. శాంతి నగర్ కు చెందిన బగ్గా రంగవల్లి అనే మహిళా వాలంటీర్ ఈ ఫిర్యాదు చేశారు. దీన్ని విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వాపసు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఆ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాది ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయనేందుకు సరైన పత్రాలు సమర్పించాలని సూచించింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల బాధితురాలైన వాలంటీర్ మనోవేదనకు గురయ్యారని ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే కోర్టు ఈ ఫిర్యాదుని విచారణకు స్వీకరించకుండా వాపసు చేయడం విశేషం. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం వేయాలనుకుంటున్న పరువునష్టం దావా వ్యవహారం కూడా హైలెట్ అవుతోంది. ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై దావా వేయాలని నిర్ణయించింది. ప్రైవేటు ఫిర్యాదు వాపసు కావడంతో, ప్రభుత్వం వేసే పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ మొదలైంది.
వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, వుమన్ ట్రాఫికింగ్ కి అది ప్రధాన కారణం అవుతోందని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు.. పవన్ పై ధ్వజమెత్తారు. అటు వాలంటీర్లు కూడా పవన్ దిష్టిబొమ్మలు దహనం చేసి, నిరసనలు చేపట్టారు.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో మహిళా వాలంటీర్ చేసిన ఫిర్యాదుని కోర్టు వాపసు చేయడం ఆసక్తికర పరిణామం.