Telugu Global
Andhra Pradesh

నిజంగా పవన్ను అభినందించాల్సిందే

రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జ‌రిగే అంతర్జాతీయ పెట్టుబడల సదస్సు విజయవంతం కావాలని ఆశించారు. ఇంతపెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. విశాఖకు వస్తున్న అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు రాష్ట్రంలోని పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాలని చెప్పారు.

నిజంగా పవన్ను అభినందించాల్సిందే
X

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కన్నా తాను చాలా నయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరూపించుకున్నారు. రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జ‌రిగే అంతర్జాతీయ పెట్టుబడల సదస్సు విజయవంతం కావాలని ఆశించారు. ఇంతపెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. విశాఖకు వస్తున్న అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు రాష్ట్రంలోని పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాలని చెప్పారు.

రాబోయే పెట్టుబడులు మొత్తం విశాఖలోనే పెట్టకుండా తిరుపతి, అమరావతి, కాకినాడ, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు, ఒంగోలు లాంటి ప్రాంతాలకు కూడా విస్తరించేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను, ఖనిజ సంపదను, రవాణా సౌకర్యాలను పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణంగా వివరించాలన్నారు. మధ్యవర్తులు, కమీషన్ల గొడవ లేకుండానే పరిశ్రమలు ఏర్పాటు చేయచ్చనే నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వం కలిగించాలని చెప్పారు.

రాబోయే రెండు రోజులు ప్రభుత్వంపై జనసేన ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు చోటివ్వదని పవన్ హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వానికి జనసేన పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. రాజకీయాలకన్నా తమకు రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని తేల్చిచెప్పారు. పెట్టుబడుల సదస్సు విషయంలో పవన్ వ్యవహరించిన తీరు చాలా హుందాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్లో ఎంతటి కసి పేరుకుపోయిందో అందరికీ తెలిసిందే. అయినా పెట్టుబడుల సదస్సు విషయంలో మాత్రం రాజకీయాలకన్నా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని చెప్పటాన్ని అభినందించాల్సిందే.

ఇదే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని, ఏమిచూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారంటు ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలను జగన్ ప్రభుత్వం తరిమేస్తోందని బురదచల్లేశారు. పెట్టుబడుల సదస్సు ఎక్కడ విజయవంతం అయిపోతుందో, లక్షల కోట్ల రూపాయల పెట్టబుడులు ఎక్కడ వచ్చేస్తాయో అన్న ఆందోళన అచ్చెన్న మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు ఏర్పాటు కాకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదని టీడీపీ కోరుకుంటోందని అందరికీ అర్థ‌మైపోతోంది.

First Published:  3 March 2023 5:24 AM GMT
Next Story