Telugu Global
Andhra Pradesh

తెనాలి మనదే.. మరో సీటు ఖరారు చేసిన పవన్

తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్, ఈసారి తెనాలి సీటు, గెలుపు.. రెండూ మనవే అని తేల్చి చెప్పారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు నియోజకవర్గ ప్రజలకు అవసరం అని అన్నారాయన.

తెనాలి మనదే.. మరో సీటు ఖరారు చేసిన పవన్
X

ఎత్తులు, పొత్తులు అంటూనే మెల్ల మెల్లగా ఒక్కోసీటు ఖరారు చేస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్. ఆమధ్య పంచకర్ల రమేష్ బాబు పార్టీలో చేరిన సందర్భంలో పెందుర్తి సీటు ఆయనకే అనే సిగ్నల్ పంపించారు. ఆమంచి స్వాములు చేరిక కూడా ప్రకాశం జిల్లాలో ఓ కీలక నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకునే జరిగింది. ఒకటి రెండు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను కూడా ప్రకటించి, అక్కడ వారే అభ్యర్థులు అన్నంత సీన్ క్రియేట్ చేశారు జనసేనాని. తాజాగా తెనాలి సీటుని నాదెండ్ల మనోహర్ కి ఖాయం చేస్తూ తీర్మానం చేశారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో జనసేన జెండా ఎగురుతుందని, నాదెండ్ల మనోహర్ కచ్చితంగా గెలుస్తారని చెప్పారు పవన్. అంటే ఆ సీటు పొత్తుల్లో ఎక్కడికీ పోదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చినట్టే లెక్క.

తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్, ఈసారి తెనాలి సీటు, గెలుపు.. రెండూ మనవే అని తేల్చి చెప్పారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు నియోజకవర్గ ప్రజలకు అవసరం అని అన్నారాయన. నాదెండ్ల చిత్తశుద్ధిని, నిబద్ధతను తెనాలి ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు. మొత్తమ్మీద తెనాలి నియోజకవర్గం ఖాయం కావడంతో అటు నాదెండ్ల కూడా సంతోషంగానే ఉన్నారు. 2014లో కూటమి అభ్యర్థిగా తెనాలిలో టీడీపీ టికెట్ పై గెలిచిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, 2019లో నాదెండ్ల పోటీ చేయడంతో ఓట్ల చీలికతో పరాజయం పాలయ్యారు. ఈసారి కూడా ఆయన అక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. సడన్ గా ఆ ఆశలపై పవన్ నీళ్లు చల్లారు.


పవన్ వ్యూహమేంటి..?

టీడీపీతో సంప్రదింపులు జరిపారా..? లేక జనసేనకు ఫలానా నియోజకవర్గాలు కావాలని డిమాండ్ చేశారా..? ఏం జరిగిందో తెలియదు కానీ పవన్ మాత్రం సొంతగా అభ్యర్థులను ప్రకటించుకు పోతున్నారు. ఆల్రడీ పొత్తులో ఉన్న బీజేపీకి కూడా ఇది మింగుడు పడని వ్యవహారమే. అధిష్టానంతో చర్చలు, ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వంతో చర్చలు, ఇలా సవాలక్ష వ్యవహారాలున్నాయి బీజేపీలో. వాటన్నిటినీ కాదని పవన్ సొంతంగా అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మరి దీనిపై టీడీపీ, బీజేపీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  2 Aug 2023 2:11 AM GMT
Next Story