జగన్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్..
పోలవరం విషయంలో జగన్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.
పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో పొత్తుల వ్యవహారం తేల్చుకుంటారేమోనని అనుకున్నారంతా. అయితే పనిలో పనిగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిశారాయన. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందించారు. అక్కడి వరకు ఓకే. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడమే విశేషం.
పోలవరం విషయంలో జగన్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఏపీకి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ ని వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తయ్యేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. నాదెండ్ల మనోహర్ తో కలసి షెకావత్ కి వినతిపత్రం అందించారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, అందుకే ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతి లేదని ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదని తన వినతి పత్రంలో పేర్కొన్నారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటిని, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటిని తీసుకెళ్లే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంపై తెలివిగా వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందన్నారు.
పోలవరం త్వరగా పూర్తి చేయండి అని చెబితే పర్లేదు, అక్కడితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ హయాంలో పనులు జరిగాయని, వైసీపీ హయాంలో పనులు జరగలేదనే కంప్లయింట్ కూడా చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీకి వెళ్లినా పవన్, జగన్ పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారంటూ వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.