Telugu Global
Andhra Pradesh

అసెంబ్లీ గేటు తాకడం కాదు, బద్దలు కొట్టుకుని మరీ..

హోంశాఖ కాకుండా పంచాయతీరాజ్ శాఖ ఎందుకు తీసుకున్నారనే వియంపై కూడా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

అసెంబ్లీ గేటు తాకడం కాదు, బద్దలు కొట్టుకుని మరీ..
X

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో తొలిసారిగా ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ గతంలో వైసీపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని అసెంబ్లీలో అడుగుపెడతారని తన గురించి టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని గర్వంగా చెప్పుకున్నారు పవన్ కల్యాణ్.


పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో జనసేన గురించి మాట్లాడుకునేలా చేసిందని అన్నారు పవన్ కల్యాణ్. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని, అందుకే రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించి, డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని, పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచిన చరిత్ర దేశంలో ఏ పార్టీకి లేదని, 100 శాతం స్ట్రైక్‌ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదన్నారు పవన్.

హోం శాఖ ఎందుకు తీసుకోలేదంటే..?

చాలా మంది తనను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే తాను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నానని వివరించారు పవన్. తనకు ఎలాంటి లంచాలు అవసరం లేదని, నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పాన్నారు. ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నానని, బాధ్యతగా ఉండాలనే తన శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నామని చెప్పారు. తాను ఏపీలో ఉండనని, హైదరాబాద్ లోనే ఉంటానని తనపై ప్రచారం జరిగిందని, అందుకే తాను పిఠాపురంలో మూడు ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నానని అన్నారు పవన్.

ఓటర్లు రక్తం చిందించకుండా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారన్నారు పవన్. 151 స్థానాలున్న పార్టీని 11 స్థానాలకు పడగొట్టారన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. పిఠాపురం ప్రజల వినతులు తీసుకోడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించానన్నారు పవన్. తాను సీఎం చంద్రబాబు కలసి రాష్ట్ర అభివృద్ధికోసం ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.

First Published:  3 July 2024 8:55 PM IST
Next Story