అంజు యాదవ్ కి చార్జ్ మెమో.. తిరుపతిలో తేల్చుకుంటానన్న పవన్
సోమవారం పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్తారు. తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
జనసేన నిరసనల్లో సాయి అనే నాయకుడిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ కి అధికారులు చార్జ్ మెమో జారీ చేశారు. జనసేన నాయకుడిపై చేయి చేసుకున్న ఘటనతోపాటు ఆమె పాత వీడియోలు కొన్ని బయటకొచ్చాయి. స్థానికంగా అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెకు చార్జ్ మెమో ఇచ్చారు. జనసేన నాయకుడిపై సీఐ చేయి చేసుకున్న ఘటనపై జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక సమర్పించారు.
తిరుపతికి పవన్..
పవన్ వర్సెస్ వాలంటీర్ల వ్యవహారంలో నిరసన తెలియజేస్తున్న జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. సాయి అనే జనసేన నేతకు సీఐ చెంప చెళ్లుమనిపించారు. ఆమె కొడుతున్నా కూడా సహనంగా ఉన్న సాయిని పవన్ కల్యాణ్ తన మీటింగ్ లో అభినందించారు. సాయిలాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలన్నారు. ఈ క్రమంలోనే పవన్ తిరుపతికి వచ్చి ఆ సీఐ సంగతి తేల్చుకుంటానన్నారు.
సోమవారం తిరుపతికి శ్రీ @PawanKalyan గారు
— JanaSena Party (@JanaSenaParty) July 15, 2023
• శ్రీ కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం pic.twitter.com/P2otok0MbR
సోమవారం పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్తారు. తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలకు తాను అండగా నిలబడతానని చెప్పిన పవన్, ఆ మాట నిలబెట్టుకోడానికి తిరుపతికి బయలుదేరుతున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతి రాక సందర్భంగా స్థానిక వాలంటీర్లు ఆందోళన చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.