పవన్ నియోజకవర్గంపై క్లారిటీ.. త్వరలో ప్రకటన
కాపు ఓటు బ్యాంకుని నమ్ముకుని రంగంలోకి దిగితే గతంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి కూడా అదే ప్రయోగం చేయాలా, లేక జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అనేది తేల్చుకోలేకపోతున్నారు పవన్.
2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాలనుంచి పోటీ చేసి ఓడిపోయారు పవన్ కల్యాణ్. ఓడిపోయినా కూడా తాను స్థానికులకు అండగా ఉంటానని చెప్పారు. కానీ ఆ హామీ నెరవేర్చుకోలేకపోయారు పవన్. మళ్లీ ఎన్నికల టైమ్ వచ్చింది.
ఈసారి ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే ఆసక్తి జనసైనికులతోపాటు అందరిలోనూ ఉంది. ఆ విషయంలోనే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. కాపు ఓటు బ్యాంకుని నమ్ముకుని రంగంలోకి దిగితే గతంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఈసారి కూడా అదే ప్రయోగం చేయాలా, లేక జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అనేది తేల్చుకోలేకపోతున్నారు. చిరంజీవికి విజయం కట్టబెట్టిన తిరుపతిని ఎంపిక చేసుకుందామనుకుని ఎందుకో వెనకడుగు వేశారు పవన్. ఇటీవల భీమవరంలో మీటింగ్ పెట్టినా ఫలితం శూన్యం. దీంతో ఆయన మరో సేఫ్ ప్లేస్ కి వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
పిఠాపురం ఓకేనా..?
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎల్లోమీడియా కన్ఫామ్ చేసింది కాబట్టి దాదాపుగా పవన్ కి పిఠాపురం ఖాయం అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన లాజిక్ లను కూడా ఎల్లో మీడియా తెరపైకి తెచ్చింది.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ విజయానికి ఢోకా ఉండదనేది ఎల్లో మీడియా కథనం. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావం కాకినాడ రూరల్, ఎంపీ స్థానంపై కూడా ఉంటుందని, ఆ మూడు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు సునాయాసం అవుతుందని అంటున్నారు.
పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో ఈసారి వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయబోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు ప్రభావం వైసీపీపై ఉంటుందనేది వైరి వర్గాల అంచనా. పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు. ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్ చార్జ్ గా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. ఆయన్ను కూడా ఆల్రడీ బుజ్జగించారని, ఆ స్థానం జనసేనకు ఖాయమైందని, పవన్ కల్యాణే స్వయంగా పోటీ చేస్తున్నారని ఎల్లో మీడియా నమ్మకంగా చెబుతోంది. మరో సిల్లీ లాజిక్ కూడా బయటకు తెచ్చారు. కొన్ని రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద 4 ఎకరాల్లోని ఓ హెలిప్యాడ్ ను జనసేన నేతలు 2 నెలలకు లీజుకు తీసుకున్నారట. పిఠాపురం నుంచి పోటీచేసే ఉద్దేశంతోనే పవన్ ప్రచారం కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారని అంటున్నారు. భీమవరం విషయంలో తర్జన భర్జనలు పడుతున్న పవన్.. పిఠాపురంకు ఫిక్స్ అవుతారో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.