Telugu Global
Andhra Pradesh

మలికిపురం సభలో పవన్ వీరావేశం

తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోనుంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు.

మలికిపురం సభలో పవన్ వీరావేశం
X

వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. 12 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో మొదటి దశ యాత్ర పూర్తి చేశారు పవన్. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. మలికిపురంలో సభలో కూడా పవన్ ఆవేశంగా మాట్లాడారు. తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోనుంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదని, తన ఒంటిపై రాయిపడితే తానేంటో చూపిస్తానని అన్నారు. తాను రౌడీలకు భయపడే రకం కాదని, తానొక విప్లవకారుడినని, విప్లవ పంథాలో ఉన్న రాజకీయ నాయకుడినని పేర్కొన్నారు పవన్.

అంతర్వేది రథాన్ని వైసీపీ క్రిమినల్స్ కాల్చేశారని, చివరకు ఆ నెపం పిచ్చోడిపై నెట్టేశారని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఏపీలో దేవాలయాలపై 219 ఘటనలు జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. క్రిమినల్స్‌ను వదిలేస్తే మహిళల మానప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. కారు డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఆనాడు తాను దళితులకు అండగా నిలబడ్డానని గుర్తు చేశారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూస్తామన్నారు.


మేం అధికారంలోకి వస్తే..

వారాహి సభల్లో ఇప్పటి వరకూ వైసీపీపై విమర్శలు గుప్పించిన పవన్, మలికిపురం సభలో మాత్రం తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనేది సుదీర్ఘంగా వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే తిరుమల శ్రీవాణి ట్రస్టు అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. కోనసీమ రైల్వే లైన్, సఖినేటిపల్లి – చించునాడ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజోలుని టూరిజం హబ్ గా తయారు చేస్తామని, ప్రతి ఇంటికి 25లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 500మందికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, హామీ ఇచ్చారు పవన్. మలికిపురంలో బైపాస్ రోడ్డు వేయాలని డిమాండ్ చేసిన పవన్, ప్రభుత్వానికి 15రోజులు డెడ్ లైన్ పెట్టారు. ఆలోపు రోడ్డు వేయకపోతే, జనసైనికులు శ్రమదానం చేపట్టి పూర్తి చేస్తారని చెప్పారు.

పోటీపడండి, కానీ పక్క పార్టీల్లోకి వెళ్లకండి..

జనసేన తరపున ప్రతి నియోజకవర్గంలో పోటీకి నలుగురైదుగురు ముందుకు వస్తున్నారని, ఇది సంతోషకర పరిణామం అన్నారు పవన్. అయితే జనసేన ఓటుతో గెలిచి వేరొక పార్టీలోకి పోతే ప్రజలు సహించరని మండిపడ్డారు. గోదావరిలా తాను ఈ నేలను అంటి పెట్టుకుని ఉంటానన్నారు. ఏపీలో బటన్ నొక్కితే రూ.10 వేలు పడుతున్నాయని, కానీ పన్నుల పేరుతో దాన్ని తిరిగి ప్రభుత్వమే తీసేసుకుంటోందని విమర్శించారు పవన్ కల్యాణ్.

First Published:  26 Jun 2023 7:11 AM IST
Next Story