Telugu Global
Andhra Pradesh

ఇన్నిసార్లు దుర్మార్గులను నమ్మారు.. ఈసారి నన్ను నమ్మండి

తాను సీఎం అయినంత మాత్రాన సరిపోదని, అద్భుతాలు జరిగిపోవని అన్నారు పవన్ కల్యాణ్. సీఎం పదవి మంత్రదండం కాదన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు తాను సీఎం అయితే ఉపయోగం ఉంటుందన్నారు.

ఇన్నిసార్లు దుర్మార్గులను నమ్మారు.. ఈసారి నన్ను నమ్మండి
X

గత ఎన్నికల్లో జగన్ స్లోగన్ ని ఈసారి పవన్ అందుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటున్నారు, ఒక్కసారి అవకాశమివ్వండి, అసెంబ్లీకి పంపించండి, నేనేెంటో చూపిస్తానంటూ నమ్మబలుకుతున్నారు. "ఓట్లు కొనుక్కునే నాయకులు సమస్యల గురించి మాట్లాడరు, ఇన్నిసార్లు దుర్మార్గులను నమ్మారు, ఈసారి నన్ను నమ్మండి" అని అభ్యర్థించారు. స్వల్ప అనారోగ్యంతో వారాహి యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించిన పవన్ కల్యాణ్ భీమవరంలో జరిగిన తూర్పుకాపుల సమావేశంలో పాల్గొన్నారు. తూర్పుకాపుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సహా పలువురు నాయకులకు జనసేన కండువాలు కప్పారు.

నేను సీఎం అయితే..?

తాను సీఎం అయినంత మాత్రాన సరిపోదని, అద్భుతాలు జరిగిపోవని అన్నారు పవన్ కల్యాణ్. సీఎం పదవి మంత్రదండం కాదన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు తాను సీఎం అయితే ఉపయోగం ఉంటుందన్నారు. నిజంగా తాను సీఎం అయినా, పరిస్థితులు, కొందరు వ్యక్తుల వల్ల నిబద్ధతతో పని చేయకపోవచ్చని, రేపు జనసేన అధికారంలోకి వచ్చినా తనను కూడా ప్రశ్నించాలన్నారు.


అందరూ అందరే..

రాష్ట్రంలో తూర్పు కాపుల జనాభా 46 లక్షలు ఉందని ఆ సంఘాలు చెబుతుంటే.. ఒక్కో ప్రభుత్వం ఒక్కోరకంగా లెక్కలు చెబుతూ వారికి అన్యాయం చేస్తోందన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ లెక్కలో తూర్పు కాపులు 26 లక్షలమందే అని, వైసీపీ లెక్కలో వారి సంఖ్య కేవలం 16 లక్షలు అని చెప్పారు. తూర్పు కాపులను పథకాల నుంచి దూరం చేసేందుకే ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే కచ్చితమైన గణాంకాలతో లెక్క తేలుస్తామన్నారు. తూర్పుకాపుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారని, వారంతా సామాజికవర్గాన్ని వాడుకుని సంపద పెంచుకున్నారే తప్ప కులం ఎదుగుదలకు ఉపయోగపడలేదని విమర్శించారు. తూర్పు కాపులకు తాను హామీ ఇస్తున్నానని, ఇకపై వారి వెంట తాను ఉంటానని చెప్పారు పవన్. ఈరోజు, రేపు భీమవరంలోనే విశ్రాంతి తీసుకుని, ఈ నెల 30న అంబేద్కర్‌ కూడలి వద్ద బహిరంగ సభలో పాల్పొంటారు పవన్.

First Published:  28 Jun 2023 6:53 AM IST
Next Story