ఎమ్మెల్యే టికెట్టే కాదు.. ఇంకా చాలా ఉంటాయ్.. నేతల్ని దువ్వుతున్న పవన్
గత రెండు రోజులు విశాఖ జిల్లా పరిధిలోని పార్టీ నేతలు, వీరమహిళలతో పవన్ కళ్యాణ్ వరుసగా భేటీ అయ్యారు.

సొంతంగా పోటీ చేద్దామని కార్యకర్తలు ఎంత తపిస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతో పొత్తుకే సై అంటున్నారు. దీంతో పట్టుమని పాతిక సీట్లు కూడా జనసేనకు వచ్చే అవకాశాల్లేవని తెలిసినా పవన్‌ను కాదనలేక నేతలు మిన్నకుండిపోతున్నారు. ఇలాంటి నేతలను దువ్వే కార్యక్రమాన్ని పవన్ సీరియస్‌గానే మొదలుపెట్టారు.
సముచిత స్థానం కల్పిస్తాం
గత రెండు రోజులు విశాఖ జిల్లా పరిధిలోని పార్టీ నేతలు, వీరమహిళలతో పవన్ కళ్యాణ్ వరుసగా భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని, మనకు చాలా అవకాశాలు వస్తాయని వారిని బుజ్జగించారు. జనసేన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది. ఇప్పటి ఎన్నికల్లో టికెట్లు మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల్లో మనకు అవకాశాలు వస్తాయని వారికి ఆశచూపారు.
మూడో వంతు పదవులు దక్కించుకుందాం
నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో మనకు సముచిత స్థానం దక్కేలా చూసుకుందాం. మూడో వంతు పదవులు దక్కించుకుందాం అని పవన్ నేతలకు చెప్పారు. కూటమి నిజంగా అధికారంలోకి వస్తుందా, ఒక వేళ వచ్చినా చంద్రబాబు అండ్ కో మనకు అంత సీన్ ఇస్తారా అని జనసేన నాయకులు సణుక్కుంటున్నారు.