నా చొక్కా పట్టుకునే దమ్ము ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా..?
రాజధాని నిర్మాణానికి డబ్బుతో పనిలేదని అన్నారు పవన్ కల్యాణ్. తాము అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని, రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తన చొక్కా పట్టుకునే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. తనపై కేసులు పెట్టారని అయినా భయపడబోనని, తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని అయినా వెనక్కి తగ్గనని అన్నారు. వైసీపీ గూండాలతో పోరాడే ధైర్యం తనకుందని, వారిని ఎదిరిస్తానని, వీధుల్లోకి లాక్కొస్తానని చెప్పారు. ఒక్కసారి జనసేనకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. విజయనగరంలో గుంకలాం ప్రాంతంలో జగనన్న కాలనీలో పర్యటించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో 10,600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మండిపడ్డారు పవన్. దానిపై మోదీకి వివరాలు అందిస్తానన్నారు. వైజాగ్ లో ఇలాగే రాజధాని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. రాజధానికి డబ్బుతో పనిలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని, రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లే వేయలేని ప్రభుత్వం ఇక రాజధాని ఎలా కడుతుందని ప్రశ్నించారు. ఏ ప్రాంత సమస్యలు ఆ ప్రాంతంలోనే తేల్చేస్తానని, మంత్రి బొత్స సత్యనారాయణ తన జేబులోని సొమ్ముని ఖర్చుపెట్టడంలేదని, అదంతా ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించిందేనని చెప్పారు.
గడప గడపకి వైసీపీ నాయకులొస్తే నిలదీయాలని చెప్పారు పవన్ కల్యాణ్. ఇప్పటి వరకూ సమన్వయం పాటించామని, ఇకపై వారి భాషలోనే వారికి సమాధానం చెబుతామన్నారు. ఓట్లు వస్తాయో..లేవో అనవసరం, ముందు నామినేషన్ వేద్దామని పిలుపునిచ్చారు. అడ్డుకుంటే కాళ్లు కీళ్లు విరగ్గొడదామని చెప్పారు. రైతుల కన్నీరు తుడిచే పార్టీ జనసేన అని చెప్పారు పవన్. జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తానని చెప్పారు. అవినీతి రహిత పాలనను ప్రజలకు పరిచయం చేస్తామన్నారు పవన్.