Telugu Global
Andhra Pradesh

జనసైనికుల విజ్ఞప్తి బేఖాతరు.. మండలికే అవనిగడ్డ టికెట్‌

మండలి చేరికను స్థానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో జనసేనను విమర్శించిన మండలిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

జనసైనికుల విజ్ఞప్తి బేఖాతరు.. మండలికే అవనిగడ్డ టికెట్‌
X

అవనిగడ్డ జనసైనికుల ఆవేదన.. అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అంతా ఊహించినట్లుగానే అవనిగడ్డ టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌కు ఖాయం చేశారు పవన్‌కల్యాణ్‌. తెలుగుదేశం నుంచి అవనిగడ్డ టికెట్ ఆశించిన మండలి బుద్ధప్రసాద్‌.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో కండువా మార్చేశారు. కేవలం టికెట్‌ కోసమే ఆయన జనసేన కండువా కప్పుకున్నారనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.

మండలి చేరికను స్థానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో జనసేనను విమర్శించిన మండలిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల అవనిగడ్డలో ఆరు మండలాల నేతలు సమావేశమై మండలి చేరికను నిరసిస్తూ ర్యాలీ కూడా తీశారు. అయినప్పటికీ వీరి విజ్ఞప్తిని బేఖాతరు చేశారు జనసేనాని. అవనిగడ్డలో ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన వారిని కాదని నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ప‌వ‌న్ ఈ నిర్ణయంపై స్థానిక జనసేన నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇక రైల్వే కోడూరు నుంచి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన పవన్‌కల్యాణ్‌.. అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా తెలుగుదేశం నుంచి సానుకూలత లేకపోవడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు జనసేన చెప్పడం గమనించదగ్గ విషయం. ఇక్కడ ఇండిపెండెంట్ సర్పంచ్‌ శ్రీధర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక పాలకొండ అభ్యర్థి విషయంలోనూ పవన్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

First Published:  4 April 2024 1:46 PM IST
Next Story