Telugu Global
Andhra Pradesh

నా భార్య ఏడుస్తోంది.. పవన్ ఆవేదన

అసలీ గొడవల్లోకి తననెందుకు తీసుకొచ్చారంటూ తన భార్య ప్రశ్నించిందని, ఏడ్చిందని చెప్పుకొచ్చారు. ఇది మన దౌర్భాగ్యం అని తన భార్యకు చెప్పానని, తనని క్షమించాలని కోరానని అన్నారు పవన్.

నా భార్య ఏడుస్తోంది.. పవన్ ఆవేదన
X

పిండాకూడు అంటే పిండివంట అనుకునేవాడు

తద్దినానికి అట్లతద్దికి తేడా తెలియనివాడు

శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు

అ కి ఆ కి తేడా తెలియనివాడు

వారాహికి వరాహికి తేడా తెలియనివాడు..

అలాంటి వారి పాలనలో మనం ఉన్నామంటూ.. సీఎం జగన్ పై వెటకారంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. ఉంగుటూరు నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళలతో సమావేశమైన ఆయన సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తన వద్ద గూండాలు, రౌడీలు లేరని, నాటు బాంబులు, కొడవళ్లు తెచ్చేవారు లేరని అన్నారు. తనకు జ్ఞానం ఉందని, జ్ఞానం ఉన్న చోట భయం ఉండదని, అందుకే ప్రభుత్వ దాష్టీకానికి ఎదురెళ్తున్నానని చెప్పారు. సంస్కారం లేనివాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర దుస్థితి ఇలానే ఉంటుందన్నారు పవన్.

జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయని, ఆయనను తన మైండ్ లోనే ఉంచుకోనని చెప్పారు పవన్. జగన్ లాంటి వాళ్లు వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ లాంటివారు వస్తుంటారని చెప్పారు. ఒకరోజు లేటవ్వొచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా అని అన్నారు పవన్.

తనపై రాజకీయ విమర్శలు చేస్తున్నవారు, అన్యాయంగా తన భార్యను కూడా ఇందులోకి తీసుకొచ్చారని, అలాంటి సందర్భంలో తన భార్య కూడా బాధ పడిందని అన్నారు పవన్ కల్యాణ్. అసలీ గొడవల్లోకి తననెందుకు తీసుకొచ్చారంటూ తన భార్య ప్రశ్నించిందని, ఏడ్చిందని చెప్పుకొచ్చారు. ఇది మన దౌర్భాగ్యం అని తన భార్యకు చెప్పానని, తనని క్షమించాలని కోరానని అన్నారు పవన్. ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా రావణాసురుడు పట్టుకొచ్చాడని, తన భార్యను కూడా అందుకే రాజకీయ విమర్శల్లోకి లాగారని అన్నారు. తన తల్లి కూడా ఓ సందర్భంలో బాధపడిందని, "నీ బిడ్డను దేశం కోసం బలిచ్చానని అనుకోమ్మా" అని తాను ఆమెతో చెప్పానని అన్నారు పవన్.


ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయంటున్న పవన్, వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని, ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారని అన్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు స్పందించడం లేదని, విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

First Published:  11 July 2023 6:41 PM IST
Next Story