Telugu Global
Andhra Pradesh

అమ్మో ఇన్ని అప్పులా.. నేను జీతం తీసుకోను

గెలిచిన తర్వాత తనకు విజయ యాత్రలు చేయాలనిపించడంలేదని, గెలిచినందుకు ఆనందం లేదని, పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకు ఆనందం అని చెప్పారు పవన్.

అమ్మో ఇన్ని అప్పులా.. నేను జీతం తీసుకోను
X

గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కొన్ని శాఖల వద్ద కనీస నిధులు కూడా లేవని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయా శాఖల పరిస్థితి చూసిన తర్వాత తనకు జీతం కూడా తీసుకోవాలనిపించలేదన్నారు. తనకు కేటాయించిన శాఖలు అప్పుల్లో ఉన్నప్పుడు తాను జీతం తీసుకోవడం చాలా పెద్ద తప్పు అనిపించిందని, అందుకే జీతం వదిలేస్తున్నానని చెప్పారు పవన్. తన క్యాంప్ ఆఫీస్ లో మరమ్మతుల్ని కూడా అందుకే వాయిదా వేశానన్నారు. అవసరమైతే కొత్త ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని అధికారులతో చెప్పానన్నారు పవన్. ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని, ఒక్కో విభాగం తవ్వే కొద్దీ అప్పుల వివరాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయని చెప్పారు. అన్నీ సరిచేస్తానన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.


కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తన శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్టు వివరించారు. పిఠాపురాన్ని దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అన్నారు పవన్. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి తెస్తామని, విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపిస్తామని చెప్పారు.

గత ప్రభుత్వం వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టిందని, అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి అయినా జరిగి ఉండేదని చురకలంటించారు పవన్. గోదావరి పారుతున్నా ఈ ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులున్నాయన్నారు. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదని, కేంద్రం నిధులకు రాష్ట్రం కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు పవన్.

గెలిచిన తర్వాత తనకు విజయ యాత్రలు చేయాలనిపించడంలేదని, గెలిచినందుకు ఆనందం లేదని, పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకు ఆనందం అని చెప్పారు పవన్. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో తనకు లేదన్నారు. ప్రజల్లో తనకు సుస్థిర స్థానం కావాలన్నారు పవన్ కల్యాణ్.

First Published:  1 July 2024 2:34 PM IST
Next Story