ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ చర్య తీసుకోకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తా : పవన్ కల్యాణ్
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నట్లు అనిపిస్తుందని పవన్ అన్నారు.
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కూడా తమ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని కోటంరెడ్డిని నెల్లూరు రూరల్ పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నట్లు అనిపిస్తుందని పవన్ అన్నారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం కలిగి, హుందాగా ఉండే రాజకీయ నాయకుడిగా పేరున్న ఆనం నారాయణ రెడ్డే ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని పవన్ ప్రశ్నించారు. ఏపీలో శాసన సభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
నెల్లూరులో తాను ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉందని పవన్ చెప్పారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టక పోవడంపై తన అభిప్రాయాలను వెల్లడించడమే ఆనం చేసిన నేరంగా ప్రభుత్వ పెద్దలు భావించినట్లు ఉన్నారు. ఆయనకు కల్పించిన రక్షణ కూడా తగ్గించారని పవన్ పేర్కొన్నారు.
ఆనం నారాయణ రెడ్డి విషయంలో జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకొని వెంటనే ఆయన రక్షణ బాధ్యతలను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని పవన్ హెచ్చరించారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారని.. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదని అభిప్రాయపడ్డారు. సొంత ఎమ్మెల్యేల సంభాషణలే నిఘాలు పెట్టి, దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలియజేస్తోందని పవన్ విమర్శించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపైనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ అన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.