బుచ్చయ్య చౌదరి కోసం.. కందుల దుర్గేష్‌ను బలిపెడుతున్న పవన్!
నిడదవోలులో టీడీపీ జనసేనకు ఎంత సహకరిస్తున్నది అనుమానమే. ఇక్కడ టీడీపీలో రెండు వర్గాలున్నాయి. క్యాడర్ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వర్గం జనసేనకు సహకరిస్తే అది అద్భుతమే అవుతుంది.

రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానంపై టీడీపీ పట్టు వదల్లేదు. తమ పార్టీ సీనియర్ నేత, గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా నెగ్గుకురాగలిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం ఆ సీటు వదులుకోవాలని జనసేనపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఈ సీటుపై ఆశ పెట్టుకుని ఏళ్ల తరబడి పని చేసుకుంటున్న జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు సీటుకు బదిలీ కావాల్సి వస్తోంది. పొత్తు ధర్మానికి కట్టుబడి తాను నిడదవోలుకు వెళుతున్నట్లు దుర్గేష్ తాజాగా కడియంలో జరిగిన జనసైనికుల సమావేశంలో ప్రకటించారు.
బలి చేస్తున్నారా?
జనసేనకు క్యాడర్ బలం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు, వ్యక్తిగతంగా క్యాండేట్ అభిమానులు ఓటేస్తేనే పోటీలో ఉన్నట్లు. కానీ రాజమండ్రి రూరల్ సీటులో పోటీ కోసం ఏళ్లుగా పరితపిస్తున్న కందుల దుర్గేష్‌ను టీడీపీ ఒత్తిడితో నిడదవోలు వెళ్లాల్సిందేనని పవన్ బలవంతం చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నానన్నట్లుగా కార్యకర్తల సమావేశంలో భావోద్వేగంతో చెప్పారు దుర్గేష్. తానెవరో పూర్తిగా తెలియని నియోజకవర్గానికి వెళ్లి బలయిపోతున్నానన్న బాధ ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
టీడీపీలో వర్గాలు సహకరిస్తాయా?
నిడదవోలులో టీడీపీ జనసేనకు ఎంత సహకరిస్తున్నది అనుమానమే. ఇక్కడ టీడీపీలో రెండు వర్గాలున్నాయి. క్యాడర్ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వర్గం జనసేనకు సహకరిస్తే అది అద్భుతమే అవుతుంది. కందుల దుర్గేష్‌ను నిడదవోలుకు పంపుతారని రెండు పార్టీల అధిష్టానాలు దాదాపు 10, 15 రోజులుగా చెబుతున్నా శేషారావు వర్గం పట్టు వీడలేదు. మా నిడదవోలు- మా శేషారావు, ఆయనకే టికెట్ ఇవ్వాలంటూ ఆయన వర్గం రెండు రోజుల కిందట నిడదవోలులో పెద్ద బలప్రదర్శనే చేసింది. అసలే నియోజకవర్గంలో ముఖపరిచయాలు కూడా లేని దుర్గేష్‌కు టీడీపీ సహకరించకపోతే ఆయన బుచ్చయ్యచౌదరి, బాబు కోటాలో బలయిపోయినట్లే. ఆ బలిపీఠం మీదకు తీసుకెళుతున్నది మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణే.