పవన్‌కు అలవాటైపోయిందా?
ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపైన ఎలాంటి ఆరోపణలు అయినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వం నుండి ఏదైనా నోటీసు వస్తే మాత్రం దానికి సమాధానముండదు.
గుడ్డ కాల్చి ప్రభుత్వం మీదకు విసిరేయటం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా అలవాటైపోయింది. ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపైన ఎలాంటి ఆరోపణలు అయినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వం నుండి ఏదైనా నోటీసు వస్తే మాత్రం దానికి సమాధానముండదు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర మొదలైంది. పెడన మీటింగ్‌ను అడ్డుకునేందుకు పులివెందుల నుండి 2 వేల మంది రాళ్ళు, కర్రలు, కత్తులు పట్టుకుని నియోజకవర్గంలో రెడీగా ఉన్నారని తనకు సమాచారం వచ్చిందని ఆరోపణలు చేశారు.
పవన్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అసలే మంత్రి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పవన్ అంటే పడదు. పవన్ అంటేనే రమేష్ ఒంటికాలిపై మండిపడుతుంటారు. అందుకనే పెడన మీటింగ్‌ను అడ్డుకునేందుకు రౌడీలు రెడీగా ఉన్నారంటు ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలను, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా పవన్ స్పందించలేదు. తమ లేఖకు సమాధానం ఇవ్వకపోతే ప్రభుత్వంపై బురదచల్లటానికే పవన్ ఆరోపణలు చేశారని అనుకోవాల్సుంటుందని జిల్లా ఎస్పీ జాషువా స్పష్టంగా ప్రకటించారు.
ఇక్కడ విషయం ఏమిటంటే ఇదివరకు కోనసీమ జిల్లా పర్యటనలో కూడా వందల మంది తనపై దాడి చేయటానికి రెడీగా ఉన్నట్లు ఆరోపించారు. వారాహి యాత్రలో పాల్గొంటున్న వాళ్ళలో కనీసం 50 మందిని చంపటానికి రౌడీ మూకలు ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో 50 వేల మంది బడిపిల్లలు చనిపోయారని, 32 వేల మంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని కూడా నోటికొచ్చింది మాట్లాడేశారు. అప్పుడు కూడా మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనటానికి ఆధారాలను చూపమని నోటీసిస్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అంటే పవన్‌కు నిలువెల్లా మంటని అందరికీ తెలుసు.
తనంతటి పవర్ స్టార్, జనసేన అధినేతను జగన్ ఏమాత్రం లెక్కచేయటంలేదనే మంట పవన్‌లో బాగా ఉంది. అందుకనే ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ జగన్‌ను టార్గెట్ చేస్తుంటారు. అవసరమున్నా లేకపోయినా, సందర్భం ఏదైనా సరే తిప్పితిప్పి ఆవు వ్యాసంలా జగన్‌పై ఆరోపణలు చేసి, వార్నింగులివ్వటంతో శాంతిస్తారు. వార్నింగులివ్వటానికి విషయం ఏమీలేకపోతే మోకాళ్ళపైన నిలబెడతా, పరిగెత్తించి పరెగెత్తించి కొడతా అంటూ రెచ్చగొడతారు. మొత్తం మీద ప్రభుత్వంపైన బురదచల్లటం, సంచలనాల కోసమే ఆరోపణలు చేయటం పవన్ కల్యాణ్‌కు బాగా అలవాటైపోయింది.
♦