ఇక భూ హక్కుపై ఆ పేరు ఉండదు..
జగన్ ఫొటోతో ఇప్పటికే పంచి పెట్టినవి 20.19 లక్షలు కాగా, మరో లక్ష మేర భూ హక్కు పత్రాలు పంచాల్సి ఉంది. వాటిని కూడా ఆపేస్తున్నామని, కొత్తగా ఏపీ రాజముద్రతో టైటిల్ డీడ్స్ రైతులకు ఇస్తామని చెప్పారు మంత్రి అనగాని.
ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. పేదల భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుందని, పేదల భూమి పట్టాలపై జగన్ ఫొటోలు వేసుకుంటున్నారని, ఆ భూమి అంతా జగన్ కే చెల్లుతుందని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ ప్రచారాన్ని జనం నమ్మారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే ఓట్లు మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి. ఇప్పుడు ఆ ఆరోపణలపై చర్యలు తీసుకుంటూ తప్పుల్ని సరిచేస్తున్నట్టు చెబుతోంది కూటమి ప్రభుత్వం.
గతంలో ఏ ప్రభుత్వం అయినా పట్టాదారు పాస్ బుక్ లో భాగంగా 'భూ హక్కు పత్రం' (టైటిల్ డీడ్) ని ఇచ్చేది. కానీ వైసీపీ హయాంలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో ఆ పేరు కాస్తా 'జగనన్న భూ హక్కు పత్రం' అయింది. పట్టాదార్ పాస్ పుస్తకంపై జగన్ ఫొటో కూడా వచ్చి చేరింది. దీంతో అసలు గొడవ మొదలైంది. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయం కొత్తగా జగన్ హయాంలో ఎందుకనని, ఆయన ఫొటో, పేరు.. రైతుల పాస్ పుస్తకాలపై ఎందుకనే గొడవ మొదలైంది. తీరా ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించింది. జగన్ పేరుతో ఇప్పటి వరకు పంపిణీ అయిన 20.19 లక్షల భూ హక్కు పత్రాలను కొత్త ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వాటి స్థానంలో జగన్ ఫొటో, పేరు లేకుండా కొత్తవి ఇస్తామని చెప్పారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.
జగన్ ఫొటోతో ఇప్పటికే పంచి పెట్టినవి 20.19 లక్షలు కాగా, మరో లక్ష మేర భూ హక్కు పత్రాలు పంచి పెట్టాల్సి ఉంది. వాటిని కూడా ఆపేస్తున్నామని, కొత్తగా ఏపీ రాజముద్రతో టైటిల్ డీడ్స్ రైతులకు ఇస్తామని చెప్పారు మంత్రి అనగాని. కొత్త పాస్ పుస్తకాల డిజైన్లకు సంబంధించి మూడు నాలుగు నమూనాలు రెడీ చేస్తున్నారు. వాటిలో ఒకదాన్ని చంద్రబాబు ఫైనల్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కొత్త పాస్ పుస్తకాల పంపిణీ మొదలవుతుంది.