పాతపట్నం టిడిపిలో వర్గపోరు
వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి, ప్రజలకి దూరం అవుతూ ఉండటంతో పాతపట్నం నియోజకవర్గంలో అనూహ్యంగా టిడిపి పుంజుకుంది. అది జెడ్పీటీసీ ఎన్నికల్లో స్పష్టమైంది.హిరమండలం అభ్యర్థిగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు శ్రావణ్ ఎన్నికలో బరిలో నిలిచినా ఓటమి తప్పలేదు.

తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని సర్వేలు, ఫలితాలు వెలువడుతున్నా ఓ నియోజకవర్గంలో టిడిపి ఆశావహుల మధ్య పోటీ కేడర్‌ను ఆయోమయానికి గురిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇరువర్గాలు ప్రత్యర్థుల్లా తలపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య ఫైట్ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాతపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అనంతర పరిస్థితుల్లో కలమట మోహనరావు తనయుడు కలమట వెంకటరమణ ఇక్కడి నుంచి 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలిచి అధికార టిడిపిలోకి జంప్ కొట్టారు.
అనంతరం 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి రెడ్డి శాంతి చేతిలో పరాజయం పాలయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి, ప్రజలకి దూరం అవుతూ ఉండటంతో పాతపట్నం నియోజకవర్గంలో అనూహ్యంగా టిడిపి పుంజుకుంది. అది జెడ్పీటీసీ ఎన్నికల్లో స్పష్టమైంది. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో 38 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 37 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం జెడ్పీటీసీని టిడిపి దక్కంచుకుంది. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు శ్రావణ్ ఎన్నికలో బరిలో నిలిచినా ఓటమి తప్పలేదు. జిల్లాలో ఏకైక టిడిపి జెడ్పీటీసీగా పొగిరి బుచ్చిబాబు గెలవడానికి పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కారణమనే విశ్లేషణలున్నాయి.
వైసీపీ పరిస్థితి ఇక్కడ బాగాలేదని స్థానిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కావడంతో టిడిపిలో సీటు పోరు తీవ్రమైంది. వైసీపీ నుంచి కలమట వెంకటరమణని టిడిపిలో చేర్పించిన కింజరాపు కుటుంబం, అదే నియోజకవర్గంలో ఆయనకి ఓ ప్రత్యర్థిని కూడా సిద్ధం చేసింది. రియల్టర్ అయిన మామిడి గోవిందరావు సీటు రేసులో ముందు ఉండటానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెరవెనుక ఆశీస్సులే కారణమని కలమట వర్గం గుర్రుగా ఉంది. అయితే పాతపట్నం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిగా కలమట వెంకటరమణని అధిష్టానం కొనసాగిస్తోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలను మామిడి గోవిందరావు సొంతంగా చేపడుతూ, తనకు నారా లోకేష్ ఆశీస్సులున్నాయని, తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండటంతో పాతపట్నం టిడిపిలో వర్గపోరు రోజు రోజుకీ తీవ్రం అవుతోంది.