పవన్ వ్యవహారంపై కేంద్రం ఆరా, ఏపీ బీజేపీకి తలంటు..
విశాఖ ఎపిసోడ్ లో ఏపీ బీజేపీ పూర్తిగా విఫలమైందని భావించింది జాతీయ నాయకత్వం. రాష్ట్ర నాయకులకు తలంటింది. అర్జంట్ గా పవన్ ని కలసి మద్దతు తెలపాలని, వైసీపీని టార్గెట్ చేయాలని సూచించింది.
ఏపీలో బీజేపీకి ముందు ప్రచారం కావాలి. ఏపీలో కూడా బీజేపీ ఉందని, బీజేపీకి నాయకులున్నారనే విషయం జనంలోకి వెళ్లాలి. కానీ ఏ అవకాశాన్ని కూడా రాష్ట్ర నాయకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఆమధ్య అమరావతి రైతుల పాదయాత్ర పార్ట్-1 విషయంలో అమిత్ షా మొట్టికాయలు వేసిన తర్వాతే ఏపీ బీజేపీ నేతలు యాత్రలో పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఏపీ నాయకత్వానికి తలంటింది కేంద్రం. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని బీజేపీ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయిందని మందలించింది. అందుకే హడావిడిగా సోము వీర్రాజు విజయవాడలో రాత్రి పవన్ కల్యాణ్ బస చేస్తున్న హోటల్ వద్దకు వెళ్లి కలిసొచ్చారు. పవన్ ని కలిశాక ప్రెస్ మీట్ పెట్టి, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
పవన్ బెదిరింపులకు భయపడ్డారా..?
విశాఖ నుంచి విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన పవన్, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడారు. మోదీ, అమిత్ షా తనకు తెలిసినా తాను వారికి ఫిర్యాదు చేయనని, తనకు తానుగా ఈ సమస్య పరిష్కరించుకుంటానని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లను, ఇక్కడే ఉంటా మీ అందరి సంగతి తేలుస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ మద్దతు తనకు అవసరం లేదని పరోక్షంగా కమలదళానికి చురకలంటించారు పవన్. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనలో పడింది. విశాఖ ఎపిసోడ్ లో ఏపీ బీజేపీ పూర్తిగా విఫలమైందని భావించింది. రాష్ట్ర నాయకత్వానికి తలంటింది. అర్జంట్ గా పవన్ ని కలసి మద్దతు తెలపాలని, వైసీపీని టార్గెట్ చేయాలని సూచించింది.
పవన్ తో భేటీ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పవన్ కల్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం అని అన్నారు. విశాఖ గర్జనకి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇకపై ఉమ్మడిపోరు సాగిస్తామని హెచ్చరించారు. జనసైనికులకు తాము అండగా ఉంటామన్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ మధ్య మాత్రమే పొత్తు ఉంటుందని, టీడీపీతో పొత్తు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు వీర్రాజు.