Telugu Global
Andhra Pradesh

పాడేరు బాధితులకు నష్టపరిహారం.. నలుగురి పరిస్థితి ఇంకా విషమం

పాడేరు ఘటనలో నెలరోజుల వయసున్న పసిపాప, ఒంటిపై చిన్న దెబ్బ కూడా లేకుండా క్షేమంగా బయటపడటం విశేషం. బస్సు 50 అడుగుల లోయలో పడినా ఆ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదు. తల్లి ఒడిలో క్షేమంగా ఉంది.

పాడేరు బాధితులకు నష్టపరిహారం.. నలుగురి పరిస్థితి ఇంకా విషమం
X

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు లోయలోకి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో చనిపోగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం జగన్ ప్రకటించారు. వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పరిహారం.

పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు.. గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ పరిహారం అందించాలని అధికారులను సీఎం కార్యాలయం ఆదేశించింది.

మృత్యుంజయురాలు..

పాడేరు ఘటనలో నెలరోజుల వయసున్న పసిపాప ఒంటిపై చిన్న దెబ్బ కూడా లేకుండా క్షేమంగా బయటపడటం విశేషం. బస్సు 50 అడుగుల లోయలో పడినా ఆ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదు. తల్లి ఒడిలో క్షేమంగా ఉంది. విశాఖపట్నానికి చెందిన తాంగుల జ్యోతి తన నెల రోజుల బిడ్డతో బస్సు ఎక్కింది. గొందూరులో ఉన్న బంధువుల ఇంటికి ఆమె వెళ్లాలి. అయితే బస్సు ప్రమాదంలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. బస్సు లోయలోకి పడిపోతుందని తెలిసిన క్షణంలో బిడ్డకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తపడింది. బిడ్డ చుట్టూ రక్షణ కవచంలా నిలిచింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బలు తగిలాయి కానీ, బిడ్డ ఒంటిపై చిన్న గీత కూడా పడలేదు. మృత్యుంజయురాలుగా నిలిచిన ఆ బిడ్డను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తల్లి జ్యోతి ఆరోగ్యం కూడా ప్రస్తుతం నిలకడగానే ఉంది.

ఘాట్ రోడ్డులో ఒరిగి ఉన్న చెట్టు కొమ్మలను తొలగించకుండా అక్కడ రాళ్లు అడ్డుగా పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డుపై చెట్టుకొమ్మ అడ్డుగా ఉండటంతో, పక్కనుంచి బస్సుని నడిపారు డ్రైవర్. ఎదురుగా బైక్ రావడంతో దాన్ని తప్పించబోయారు, దీంతో బస్సు లోయలో పడిపోయింది.

First Published:  21 Aug 2023 7:38 AM IST
Next Story