Telugu Global
Andhra Pradesh

ఓవర్ యాక్షనే కొంపముంచుతోందా?

ఒకే అంశంపై వివిధ కోణాల్లో వరసుగా పిటీషన్లు వేయటం వెంటనే విచారణ జరపాలని పట్టుబట్టడం అలవాటైపోయిందని చంద్రబాబు లాయర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా లాయర్లు ఇలాగే వ్యవహరించి జడ్జి ఆగ్రహానికి గురయ్యారు

ఓవర్ యాక్షనే కొంపముంచుతోందా?
X

స్కిల్ స్కామ్ కేసులో మొదటి నుండి చంద్రబాబునాయుడు తరపున లాయర్లు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉన్నారు. లాయర్ల ఓవర్ యాక్షన్‌పై వివిధ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతోంది. తాజాగా ఏసీబీ కోర్టులో లాయర్లు వైఖరిపై జడ్జి మండిపోయారంటేనే వీళ్ళ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థ‌మవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బెయిల్ పిటీషన్లు దాఖలు చేసిన లాయర్లు వెంటనే విచారణ జరగాలని పట్టుబట్టారు.

అయితే అప్పటికే పోలీస్ కస్టడీ పిటీషన్ పెండింగులో ఉంది కాబట్టి బెయిల్ పిటీషన్ మీద విచారణ చేయలేనని జడ్జి చెప్పారు. అయినా సరే చంద్రబాబు లాయర్లు వినకుండా తమ పిటీషన్ను విచారణ చేయాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పిటీషన్ మీద విచారణ జరపాలో కూడా మీరే నిర్ణయిస్తారా? తనపై ఒత్తిడి తెస్తారా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కస్టడీ, బెయిల్ పిటీషన్లలో దేన్ని ముందు విచారణ చేయాలో మంగళవారం నిర్ణయిస్తానని చెప్పారు. దాంతో చంద్రబాబు లాయర్లు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.

ఒకే అంశంపై వివిధ కోణాల్లో వరసుగా పిటీషన్లు వేయటం వెంటనే విచారణ జరపాలని పట్టుబట్టడం అలవాటైపోయిందని చంద్రబాబు లాయర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా లాయర్లు ఇలాగే రెండుసార్లు వ్యవహరించి జడ్జి ఆగ్రహానికి గురయ్యారు. సిద్దార్థ‌ లూథ్రా కూడా మొదట్లో ఇలాగే జడ్జిని ఒత్తిడి చేసి కోపానికి గురయ్యారు. ఇక్కడ విషయం ఏమిటంటే స్కిల్ స్కామ్‌తో చంద్రబాబుకు సంబంధంలేదని వాదించటానికి లాయర్ల దగ్గర ఎలాంటి పాయింట్లు ఉన్నట్లు లేదు. అందుకనే టెక్నికల్ అంశాలను మాత్రమే పదేపదే ప్రస్తావిస్తున్నారు.

అవికూడా ఏమిటంటే అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అరెస్టుకు ముందు చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదని మాత్రమే వాదిస్తున్నారు. ఒకసారి ఈ వాదనలను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇవే అంశాలపై చంద్రబాబు లాయర్లు పిటీషన్లు వేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబును ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బెయిల్ మీద బయటకు తెచ్చేయాలన్న ఆతృతలో లాజిక్కును మరచిపోతున్నారు. మొత్తానికి లాయర్లు చూపుతున్న ఓవర్ యాక్షనే చంద్రబాబు కొంపముంచేస్తున్నట్లు అర్థ‌మవుతోంది.


First Published:  26 Sept 2023 10:45 AM IST
Next Story