Telugu Global
Andhra Pradesh

ఆస్కార్ తెచ్చినవారిని సన్మానించే బాధ్యత లేదా..?

తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యల తర్వాత ఆస్కార్ వ్యవహారంపై మరింత చర్చ జరిగింది. ఈ వివాదాల తేనెతుట్టె కదిపేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఇష్టపడలేదు. అందుకే ప్రభుత్వాల తరపున వేడుకలు జరగలేదు.

ఆస్కార్ తెచ్చినవారిని సన్మానించే బాధ్యత లేదా..?
X

తెలుగు సినిమాకి ఆస్కార్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ విజయాన్ని అందరూ మెచ్చుకున్నారు, నాటు నాటు పాటకు సలాం కొట్టారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేవలం సామాజిక మాధ్యమాలలో మాత్రమే విజేతల్ని మెచ్చుకున్నాయని, వారు భారత్ కి తిరిగొచ్చాక వారిని సన్మానించడం మ‌రిచాయని అంటున్నారు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు. ఆస్కార్ విన్నర్స్ ని ప్రభుత్వం తరపున కూడా సన్మానించాలని డిమాండ్ చేస్తున్నారాయన.

క్రీడలు, ఇతర రంగాల్లో ప్రపంచస్థాయిలో ఘనత సాధించిన వారు భారత్ కి తిరిగొస్తే ప్రభుత్వాలు స్వాగతం పలికే సంప్రదాయం ఉందని, అదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయంటున్నారు నిర్మాత కేఎస్ రామారావు. ఇతర రంగాల్లో అవార్డులు తీసుకొచ్చిన వారిని సత్కరించి గౌరవిస్తున్న పాలకులు, సినీ రంగంలో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ ని సాధించిన చంద్రబోస్‌, కీరవాణిలను సన్మానించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 9న హైదరాబాద్‌ లో తెలుగు చిత్ర నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో చంద్రబోస్‌, కీరవాణిలకు గౌరవ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు నిర్మాత కేఎస్ రామారావు.

ప్రభుత్వాలు ఎందుకు దూరంగా ఉన్నాయి..?

ఆస్కార్ సంబరాలు అందరూ జరుపుకున్నారు కానీ, కొంతమంది మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలపై విమర్శలు చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆస్కార్ వ్యవహారంపై మరింత చర్చ జరిగింది. డబ్బులిచ్చి అవార్డుని కొనుక్కున్నారని ఎవరూ నేరుగా అనడంలేదు కానీ, అవార్డుకోసం డబ్బు బాగానే ఖర్చుపెట్టారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ దశలో ఈ వివాదాల తేనెతుట్టె కదిపేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఇష్టపడలేదు. అందుకే ప్రభుత్వం తరపున వేడుకలు జరగలేదు. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఎక్కడా కామెంట్లు చేయలేదు. ప్రస్తుతం నిర్మాత కేఎస్ రామారావు వ్యాఖ్యలపై నినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

First Published:  9 April 2023 7:33 AM IST
Next Story