Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసలు భయమిదేనా?

సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేయటం ద్వారా జగన్ సాలిడ్‌ ఓటు బ్యాంకును స్థిరీక‌రించుకున్నాడ‌నే టెన్షన్ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాలో పెరిగిపోతోంది.

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసలు భయమిదేనా?
X

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఒకటే గోల చేస్తోంది. అదేమిటంటే ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లని చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, ఎల్లో మీడియా పదేపదే వాదిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రం అప్పులు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. నిర్మల ప్రకటనతో పురందేశ్వరి విభేదిస్తున్నారు. రూ. 10 లక్షల కోట్లు అన్న‌ ప్రకటనకే తాను కట్టుబడున్నట్లు తాజాగా పురందేశ్వరి చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా పురందేశ్వరి నమ్మటం లేదు.

సరే ఈ విషయాన్ని కాసేపు పక్కనపెట్టేద్దాం. అసలు అప్పులపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎందుకింతగా గోల చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళల్లో భయం పెరిగిపోతోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వచ్చేస్తారేమోనని.ఎల్లో మీడియా అప్పుల విషయంలో ఒక ఉదాహరణ కూడా చెప్పింది. అప్పు తెచ్చిన యజమాని ఇంటిని నిలబెట్టేందుకు వాడుతారే కానీ దానధర్మాలు, జూదం ఆడేందుకు ఉపయోగించరని, జగన్ అప్పులను బాధ్యతగా ఉపయోగించటంలేదని కూడా తేల్చేసింది.

ఇక్కడ దానధర్మాలు, జూదమంటే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని అర్థం చేసుకోవాలి.సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేయటం ద్వారా జగన్ సాలిడ్‌ ఓటు బ్యాంకును స్థిరీక‌రించుకున్నార‌నే టెన్షన్ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాలో పెరిగిపోతోంది. ఈ ఓటు బ్యాంకుతోనే మళ్ళీ గెలుస్తారన్న ఆలోచన వీళ్ళని నిద్ర కూడా పోనివ్వ‌డం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే జగన్ అధికారంలోకి వచ్చేనాటికి ఖజానాలో ఉంది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అప్పటికే చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి చంద్రబాబు చేసిన లక్షల కోట్ల రూపాయల అప్పులకు అసలు+వడ్డీలు కట్టి, పెండింగ్ పెట్టిన వేలాది కోట్ల రూపాయల బిల్లులు చెల్లించి, మళ్ళీ ప్రభుత్వాన్ని నడపాలంటే అప్పులు చేయక ఏం చేస్తారు?

జగన్ ప్రభుత్వంలో అప్పుల గురించి పదేపదే మాట్లాడుతున్న పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన అప్పుల గురించి ఎందుకు ప్రస్తావించటంలేదు? చంద్రబాబు తెచ్చిన అప్పులంతా ఎటుపోయాయో తెలీదు. ఎల్లో మీడియా లెక్కలో అప్పటి ఇంటి యజమనాని చేసిన లక్షల కోట్ల రూపాయలతో ఇల్లు నిలబడలేదే. ఇపుడు జగన్ చేస్తున్న అప్పులు కనీసం కళ్ళకు కనబడుతోంది. ఈ విషయంలోనే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా భయపడుతోంది. అందుకనే అప్పులపై ఇంత రాద్ధాంతం చేస్తోంది.

First Published:  2 Aug 2023 8:26 PM IST
Next Story