రోజాలో ఓటమి భయం మొదలైందా..?
తన ప్రత్యర్థి వర్గం చేస్తున్న పనుల వల్ల టీడీపీ, జనసేన నేతలు నవ్వుకునేట్లుగా, ఆ పార్టీలకు సపోర్టుగా ఉంటోంది కదా అంటూ ఆవేదనను వ్యక్తంచేశారు. రోజా గమనించాల్సిందేమంటే ప్రత్యర్థి వర్గం ఇప్పటికిప్పుడు పుట్టుకురాలేదు.
నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాలో ఓటమిభయం మొదలైనట్లే ఉంది. పార్టీలోని తన ప్రత్యర్థి వర్గాలను ఉద్దేశించి రోజా విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్ విన్న తర్వాత అందరిలో ఇదే అనుమానం మొదలైంది. తనకు తెలీకుండానే తన నియోజకవర్గంలో వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేయటం ఏమిటని నిలదీశారు. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురవ్వవ్వా అంటూ ప్రశ్నించారు.
తన ప్రత్యర్థి వర్గం చేస్తున్న పనుల వల్ల టీడీపీ, జనసేన నేతలు నవ్వుకునేట్లుగా, ఆ పార్టీలకు సపోర్టుగా ఉంటోంది కదా అంటూ ఆవేదనను వ్యక్తంచేశారు. రోజా గమనించాల్సిందేమంటే ప్రత్యర్థి వర్గం ఇప్పటికిప్పుడు పుట్టుకురాలేదు. రెండోసారి గెలిచిన తర్వాత ఏమైందో ఏమోగానీ రోజాకు బలమైన ప్రత్యర్థి వర్గం తయారైంది. శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్ అండ్ కో రోజాకు బలమైన ప్రత్యర్థివర్గంగా తయారయ్యారు.
రెండోసారి రోజా గెలిచింది వీళ్ళందరి మద్దతుతోనే. తర్వాత ఎక్కడ గొడవలు మొదలయ్యాయో ఏమో ఒక్కొక్కళ్ళు దూరమైపోయారు. దాంతో రోజా వ్యతిరేకులంతా ఒకవర్గంగా తయారయ్యారు. చక్రపాణిరెడ్డికి ఛైర్మన్ పదవి వద్దని, మురళీకి జడ్పీటీసీ టికెట్ వద్దని, శాంతికి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా ఇవ్వద్దని రోజా ఎంతో పట్టుబట్టారు. అయితే రోజామాటను జగన్ వినలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగా సన్నిహితుడు కావటమే కాకుండా జగన్ తో డైరెక్టుగా యాక్సెస్ ఉంది.
రోజా మంత్రయిన తర్వాత విభేదాలను సర్దుబాటు చేసుకోవాల్సిందిపోయి మరింత పెంచుకున్నారు. రేపటి ఎన్నికల్లో వీళ్ళ సహకారం లేకుండా రోజా గెలిచేది అనుమానమే. ఎందుకంటే తిరుపతి నుంచి రోజా నగరికి వలస వెళ్ళారు. కానీ ప్రత్యర్థివర్గంది మొదటినుండి నగరి నియోజకవర్గమే. వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్టే ఇవ్వద్దని ప్రత్యర్థివర్గం ఇప్పటికే జగన్ను గట్టిగా కోరింది. వచ్చే ఎన్నికల్లో రోజా గెలవాలంటే ప్రత్యర్థివర్గం ఆమెకు మద్దతుగా పనిచేయాల్సిందే. తాజాగా రోజా విడుదలచేసిన ఆడియో ద్వారా ఆమెలోని భయం అర్థమవుతోంది. ప్రత్యర్థివర్గంతో సయోధ్య చేసుకుంటారా లేకపోతే తెగేంతవరకు లాగుతారా అన్నది చూడాలి.