Telugu Global
Andhra Pradesh

బీజేపీ, టీడీపీ ప్రత్యేక రాయలసీమ డిమాండ్

ప్రభుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఒక సీనియర్ మంత్రి రాష్ట్రాన్నిమళ్లీ ముక్కలు చేయాలనడం బాధకరమన్నారు. ఒకవేళ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలనుకుంటే గ్రేటర్ రాయలసీమనూ ప్ర‌త్యేక రాష్ట్రం చేయండి అంటూ డిమాండ్ చేశారు.

బీజేపీ, టీడీపీ ప్రత్యేక రాయలసీమ డిమాండ్
X

మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలతో ఏపీలో మళ్లీ విభజన రాగాలు మొదలయ్యాయి. బీజేపీ, టీడీపీ నేతలు ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. ఒక సభలో మాట్లాడిన ధర్మాన ప్రసాద రావు.. విశాఖను రాజధానిగా చేయకుండా అమరావతే రాజధానిగా ఉండాలంటే అప్పుడు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను చిన్న రాష్ట్రం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లాకు చెందిన నేత‌ రెడ్డప్ప గారి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఒక సీనియర్ మంత్రి రాష్ట్రాన్నిమళ్లీ ముక్కలు చేయాలనడం బాధకరమన్నారు. ఒకవేళ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలనుకుంటే గ్రేటర్ రాయలసీమనూ ప్ర‌త్యేక రాష్ట్రం చేయండి అంటూ డిమాండ్ చేశారు. ఒక మంత్రే ఇలా రాష్ట్రాన్ని విడగొట్టాలి అంటుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు వైసీపీ మంత్రులకు అధికారంలో ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ధర్మానకు చిత్తశుద్ది ఉంటే మంత్రికి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయాలని సవాల్ చేశారు. ధర్మాన వ్యాఖ్యల వెనుక కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ కేంద్ర కార్యాలయమేనని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో, విభ‌జ‌న త‌రువాత చంద్రబాబు, జగన్‌ పాలనలో మోసపోయిన ప్రాంతం రాయలసీమేనన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేయాల్సి వస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు. మూడు రాష్ట్రాలు కావాలన్నది వైసీపీ ఆలోచన అయితే ఆ ప్రతిపాదన చేస్తే.. అప్పుడు బీజేపీ స్పష్టంగా స్పందిస్తుందన్నారు.

విశాఖను రాజధాని చేయని పక్షంలో రాష్ట్రాన్నే విడగొట్టాలంటున్న ధర్మాన మంత్రిగా ఉండటానికి అనర్హుడని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ధర్మాన మతిభ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మొత్తం మీద ధర్మాన వ్యాఖ్యలతో ఏపీలో మళ్లీ విభజన రాగాలు విన‌ప‌డుతున్నాయి. మంత్రే ఇలా రాష్ట్రాన్ని విడగొట్టాలంటుంటే సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  31 Dec 2022 4:42 PM IST
Next Story