ఇద్దరికీ ఇన్ని మైనస్సులున్నాయా?
నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు ఏరకమైన ఇబ్బందులున్నాయో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ నేత గాలి భానుప్రకాష్ కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా అసమ్మతి నేతల వల్లే ఇబ్బందులు పడుతున్నారు.
నగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల పరిస్థతి ఒకేలాగుంది. ఎమ్మెల్యే, మంత్రి రోజాకు ఏరకమైన ఇబ్బందులున్నాయో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ నేత గాలి భానుప్రకాష్ కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా అసమ్మతి నేతల వల్లే ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే 2014, 19 ఎన్నికల్లో రోజా గెలుపునకు సహకరించిన నేతల్లో ఇప్పుడు చాలా మంది వ్యతిరేకమయ్యారు. పార్టీలోనే కొంతమంది నేతలు రోజాను ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు.
నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డి, విజయపురం మండల నేత లక్ష్మీపతిరాజు, నగిరి మున్సిపాలిటికి ఛైర్మన్లుగా చేసిన దంపతులు కేజే కుమార్, శాంతి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఒకటై రోజాకు ప్యారలల్ రాజకీయాలు నడుపుతున్నారు. వీళ్ళంతా తమ మండలాల్లో గట్టి పట్టున్న నేతలనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా ఏకతాటిపైన నిలబడి వ్యతిరేకం చేస్తే రోజా గెలుపు అనుమానమే. మంత్రి గెలుపు కష్టమే అయినా లాజికల్‌గా ప్రత్యర్థి కూడా ఇలాంటి సమస్యలతోనే బాగా ఇబ్బంది పడుతున్నాడు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన గాలి భానుప్రకాష్ 2700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తక్కువ తేడాతో ఓటమికి ప్రధాన కారణం స్వయానా తల్లి, తమ్ముడే కావటం నమ్మలేని నిజం. కుటుంబ తగాదాల నేపథ్యంలో ముద్దు కృష్ణమనాయుడు భార్య సరస్వతి, చిన్నకొడుకు జగదీష్ పెద్దకొడుకు భానుప్రకాష్‌కు వ్యతిరేకమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన భానుకు తల్లి, తమ్ముడే వ్యతిరేకం చేశారని పార్టీలోనే ప్రచారముంది. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. రేపు భాను పోటీచేస్తే మళ్ళీ వ్యతిరేకం చేయటానికి సిద్ధంగా ఉన్నారట.
తల్లీ, తమ్ముడే కాదు ముద్దు కృష్ణమనాయుడు మద్దతుదారుల్లో చాలామంది భాను వ్యవహారశైలి కారణంగా దూరంగా ఉంటున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా భాను ఓటమికి పనిచేయటం ఖాయమట. అంటే రోజా-భాను ఇద్దరూ కూడా ఒకేలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయం అర్థమవుతోంది. మరి తమ అభ్యర్థుల గెలుపునకు అధినేతలు ఎలాంటి చొరవ చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది.