ఒక జనరేషన్‌లో ఒకరే టార్చ్‌బేరర్.. కుటుంబ రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన జగన్
రాజకీయాలు అంటే ప్రజలతో మమేకమయ్యే వ్యవహారం. ఒక పార్టీలో కుటుంబమంతా చేరితే ఎలా? ప్రజలకు మేలు చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది.
కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్ కుండబద్దలు కొట్టారు. ఒక జనరేషన్‌లో ఒకరు మాత్రమే రాజకీయాలు లీడ్ చేయాలన్నది తన అభిప్రాయమన్నారు. అందుకే తన చెల్లెల్ని వేరే రంగాల్లో ఎదగడానికి ప్రోత్సహించానని చెప్పారు. ఒక కుటుంబంలో ఒకరు వస్తే అది రాజకీయం. కుటుంబమంతా పార్టీలో ఉంటే అది పార్టీ కాదు.. వేరే ఏదో అవుతుందని వ్యాఖ్యానించారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబ రాజకీయాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు.
ఒక కుటుంబం నడిపే పార్టీ బతకదు
రాజకీయాలు అంటే ప్రజలతో మమేకమయ్యే వ్యవహారం. ఒక పార్టీలో కుటుంబమంతా చేరితే ఎలా? ప్రజలకు మేలు చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. ఇక మా పార్టీ వారసత్వం అంటారా? అది వేరే సంగతి. ఒక కుటుంబం నడిపే పార్టీ ఎప్పటికీ బతికి ఉండదనేది నా అభిప్రాయం అని జగన్ చెప్పారు.
ఒక కుటుంబంలో ఒక జనరేషన్‌లో ఒకరు మాత్రమే రాజకీయాల్ని లీడ్ చేస్తారు.. మిగిలినవాళ్లు వారికి మద్దతుగా నిలబడతారు. ఇదే మాట నేను మా కుటుంసభ్యులకూ చెప్పాను. వారిని వ్యాపారాలు, ఇతర రంగాల్లో ప్రోత్సహించాను. అంతే కానీ కుటుంబమంతా ఓ పార్టీలో చేరి, రాజకీయాలు చేస్తే అది కుటుంబ పార్టీ అవుతుంది తప్ప రాజకీయ పార్టీ ఎలా అవుతుందన్నారు.
రాజకీయాలు బంధుత్వాల్ని దెబ్బతీయకూడదు
కుటుంబమంతా కలిసినప్పుడు హాయిగా మనసువిప్పి మాట్లాడుకునేలా ఉండాలనేది నా కోరిక. రాజకీయాల్లో చేరి కుటుంబ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీయొద్దని నా కుటుంబ సభ్యులందరికీ చెప్పాను. దీన్ని అడ్డుపెట్టుకుని మనల్ని విడదీయడానికి చాలా మంది ప్రయత్నిస్తారని చెప్పాను. ఇప్పుడదే జరుగుతోంది అని జగన్ అన్నారు.