75 మంది తప్ప అందరూ బయటి వారే- అమరావతి యాత్రలో కొత్తకోణం
గడిచిన 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే యాత్ర చేశారని డీఎస్పీ చెప్పారు. కేవలం 75 మంది వద్ద మాత్రమే అమరావతి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపుకార్డులున్నాయని చెప్పారు.
అమరావతి పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్ర చేస్తున్న వారిని తనిఖీ చేయగా కీలక విషయాలు బయటపడినట్టు డీఎస్పీ బాలచంద్రారెడ్డి చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులున్న వారినే పాదయాత్రకు అనుమతిస్తామన్నపోలీసులు.. ఐడీ కార్డుల తనిఖీ చేపట్టారు. అక్కడున్న వారిలో కేవలం 75 మంది దగ్గర మాత్రమే ఐడీ కార్డులు ఉన్నాయని డీఎస్పీ వివరించారు. మిగిలిన వారంతా బయటి వ్యక్తులేనని తెలిపారు. అనుమతి ఉన్న 600 మందిలో అతి తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండడం, బయటి వారిని అనుమతించకపోవడంతోనే యాత్రను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు.
గడిచిన 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే యాత్ర చేశారని డీఎస్పీ చెప్పారు. కేవలం 75 మంది వద్ద మాత్రమే అమరావతి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపుకార్డులున్నాయని చెప్పారు. మరి ఇంతకాలం పాదయాత్ర చేస్తున్న వారుఎవరు అన్నదిపై చర్చ నడుస్తోంది. అమరావతి ప్రాంతం నుంచి 100 మందికి మించి లేకపోయినా ఆయా ప్రాంతాల్లో యాత్ర సందర్భంగా టీడీపీ శ్రేణులు యాత్రలో పాల్గొని హడావుడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అమరావతి ప్రాంతానికిచెందిన వారు కూడా విడతల వారీగా యాత్రలో పాల్గొంటున్నట్టు భావిస్తున్నారు. ఐడీ కార్డుల తనిఖీలు చేయకపోవడంతో ఇన్ని రోజులు ఇబ్బంది ఎదురు కాలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఐడీ కార్డుల తనిఖీని కఠినతరం చేయడంతో కేవలం 75 మంది మాత్రమే అమరావతి ప్రాంతం వారని నిర్ధారణ అయింది.
అమరావతి యాత్ర ఆగిపోవడంపై అటు మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఆధార్ అడిగితేనే పారిపోతే అది ఫేక్ పాదయాత్ర కాదా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.