ఈ నియోజకవర్గం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారిపోయిందా..?
ప్రతి ఎన్నికకొక అభ్యర్ధి పోటీచేస్తుండటంతో ఎంఎల్ఏలుగా పోటీచేస్తున్న నేతలతో సమన్వయం లేకుండా పోతోంది. ఎంపీగా పోటీచేస్తున్న అభ్యర్థితో ఎంఎల్ఏ అభ్యర్ధులకు వేవ్ లెంగ్త్ కుదరటంలేదు.
కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయాయి. ఎంత ప్రయత్నించినా గెలుపు మాత్రం సాధ్యంకావటం లేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంటు కూడా ఒకటి. 1983లో పార్టీ పెట్టిన దగ్గరనుండి ఇప్పటికి రెండంటే రెండుసార్లు మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. మిగిలిన అన్నీసార్లు ఎంత ప్రయత్నించినా టీడీపీ గెలుపు దక్కటమే లేదు. 1984లో బెడవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారంతే.
ఇప్పుడు సమస్య ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయటానికి పార్టీలో గట్టి నేతే దొరకటంలేదట. ఎంఎల్ఏ అభ్యర్ధులు గట్టిగానే ఉన్నా లోక్ సభకు పోటీచేసే అభ్యర్థి ఎందుకు దొరకటంలేదు..? ఎందుకంటే ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్థిని పోటీకి దింపుతున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఓడిపోగానే అభ్యర్థులే పార్టీని వదిలేసి వెళ్ళిపోవటమో లేకపోతే చంద్రబాబే దూరంపెట్టడమో చేస్తున్నారు.
ప్రతి ఎన్నికకొక అభ్యర్ధి పోటీచేస్తుండటంతో ఎంఎల్ఏలుగా పోటీచేస్తున్న నేతలతో సమన్వయం లేకుండా పోతోంది. ఎంపీగా పోటీచేస్తున్న అభ్యర్థితో ఎంఎల్ఏ అభ్యర్ధులకు వేవ్ లెంగ్త్ కుదరటంలేదు. దాంతో ఎన్నికల్లో ఎవరిదారి వాళ్ళదిగా అయిపోతుండటంతో ఎంపీ అభ్యర్ధులు ఓడిపోతున్నారు. పార్టీ గాలి బలంగా ఉన్నపుడు మాత్రమే పై ఇద్దరు కూడా గెలిచారు. గాలి లేకపోతే అంతే సంగతులు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని పోటీచేయించాలన్నది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారిపోయింది.
ఎంఎల్ఏ అభ్యర్ధుల్లో ఎవరిని అడిగినా ఎంపీగా పోటీచేయటం కష్టమని తప్పుకుంటున్నారట. అందుకనే కొత్తగా ఎవరైనా వ్యాపారవేత్త లేకపోతే పారిశ్రామికవేత్త దొరుకుతారేమో అని చంద్రబాబు వెతుకుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. నియోజకవర్గంలో పార్టీ చరిత్రను చూసిన తర్వాత ఎవరూ పోటీకి ముందుకు రావటానికి పెద్దగా ఇష్టపడటంలేదని సమాచారం.
2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా బత్తుల విజయభారతి, 2009లో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, 2014లో మాగుంట శ్రీనివాసులరెడ్డి, 2019లో శిద్ధా రాఘవరావు పోటీచేశారు. ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చేస్తుంటే ఇక పార్టీ ఎప్పటికి గెలుస్తుందో చంద్రబాబుకే తెలియాలి. ఈ కారణంవల్లే వచ్చే ఎన్నికలో పోటీకి అభ్యర్థి కోసం అంజనం వేసి వెతుకుతున్నారు.