వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట గుడ్‌బై
33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నా, 11 సార్లు చట్టసభలకు పోటీ చేసినా ఏనాడూ అహంకారం చూపించలేదని, అందుకే ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని మాగుంట చెప్పుకొచ్చారు.
వైసీపీకి రాజీనామా చేస్తున్న ఎంపీల జాబితాలో మరో పేరు చేరింది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒంగోలులో ఈరోజు ఉదయం ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.
మాగుంట అంటే ఒక బ్రాండ్!
ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని ఎంపీ వ్యాఖ్యానించారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నా, 11 సార్లు చట్టసభలకు పోటీ చేసినా ఏనాడూ అహంకారం చూపించలేదని, అందుకే ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని మాగుంట చెప్పుకొచ్చారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే వైసీపీని వీడుతున్నామన్నారు. బాధాకరమే అయినా తప్పడం లేదని చెప్పారు.
ఎంపీ బరిలో మాగుంట కుమారుడు
ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తనకు, తన అన్న సుబ్బరామిరెడ్డికి రాజకీయ జన్మనిచ్చిన ఒంగోలు ఎంపీ స్థానం నుంచే కుమారుడ్ని రాజకీయాల్లోకి దింపాలని మాగుంట ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీకి రిజైన్ చేయడంతో ఆయన రాజకీయంగా ఏ పార్టీ వైపు అడుగులేస్తారన్నది చూడాల్సి ఉంది.