Telugu Global
Andhra Pradesh

ఏపీలో మళ్ళీ టెట్.. మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ

గత వైసీపీ ప్రభుత్వం సుమారు 12వేల పోస్ట్ లతో డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించి టెట్, డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఏపీలో మళ్ళీ టెట్.. మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ
X

ఏపీలో ఇవాళ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన టెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ టెట్ లో క్వాలిఫై కానీ అభ్యర్థులకు కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే కొత్తగా టెట్ నిర్వహించబోతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. టెట్ నిర్వహణ తర్వాతే మెగా డీఎస్సీ ఉంటుందని ఆయన వెల్లడించారు.

మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ

ఏపీలో మూడు నెలల కిందటే టెట్ నిర్వహించగా, ఇప్పుడు మళ్లీ కొత్తగా టెట్ నిర్వహించి ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో డీఎస్సీ మరింత ఆలస్యం కానుంది. కాగా, గత వైసీపీ ప్రభుత్వం సుమారు 12వేల పోస్ట్ లతో డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించి టెట్, డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ముందుగా టెట్ ఎగ్జామ్ పూర్తి కాగా.. ఎన్నికల కోడ్ కారణంగా డీఎస్సీ నిర్వహణ సాధ్యం కాలేదు.

డీఎస్సీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం కూడా మారింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా.. సీఎంగా చంద్రబాబు మెగా డీఎస్సీ నిర్వహణపైనే తొలి సంతకం పెట్టారు. మొత్తం 16,347 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో ఇప్పటికే టెట్ నిర్వహణ పూర్తి కావడం, చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ కోసమే పెట్టడంతో ఇక నేరుగా డీఎస్సీ రాయవచ్చని చాలా మంది అభ్యర్థులు భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వాళ్ల కోసం మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించడంతో వారంతా నిరుత్సాహం చెందుతున్నారు. టెట్ నిర్వహించి మూడు నెలలు కూడా గడవకముందే మళ్లీ టెట్ నిర్వహణ వల్ల మరింత సమయం వృథా అవుతుందని భావిస్తున్నారు.ఈ ప్రక్రియ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యంగా రానుంది.

ఇటీవల జరిగిన టెట్ పరీక్షకు 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్లీ టెట్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కొత్తగా టెట్ నిర్వహిస్తుండడం వల్ల డీఎస్సీ నిర్వహణ, ఆ తర్వాత ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు అర్థమవుతోంది.

First Published:  26 Jun 2024 12:55 AM IST
Next Story