Telugu Global
Andhra Pradesh

14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ

జనసేన పార్టీ పదో ఆవిర్భావ స‌భ‌ను మచిలీపట్నంలో నిర్వహించనున్నట్లు తాజాగా నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సభ నిర్వహణకు గాను 34 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ
X

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మార్చి 14వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.


జనసేన పార్టీని ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2013 మార్చి 14న హైదరాబాద్ లో స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత 2014లో ఏపీలో ఎన్నికలు జరిగినప్పటికీ జనసేన పార్టీ పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించింది.

ఆ పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

కాగా జనసేన పార్టీ పదో ఆవిర్భావ స‌భ‌ను మచిలీపట్నంలో నిర్వహించనున్నట్లు తాజాగా నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సభ నిర్వహణకు గాను 34 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తల కోసం సభా స్థలి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మనోహర్ తెలిపారు.


భద్రతా లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో సభాస్థలికి వస్తారని మనోహర్ తెలిపారు. దారి పొడవునా ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరిస్తారని చెప్పారు.

First Published:  1 March 2023 7:18 PM IST
Next Story