సర్ భోజనాలు సింపుల్‌గా ఇలా ఉండాలి- ప్రవీణ్ ప్రకాశ్ కోసం ఆదేశాలు
పండ్లు, డ్రై ఫ్రూట్స్, నాన్‌వెజ్, పండ్ల రసాలు వంటి వాటిని సిద్ధం చేయవద్దని వివరించారు. మెనూ సింపుల్‌గానే ఉన్నప్పటికీ.. పలాన వాటిని సిద్దం చేయాలని ఆదేశాల రూపంలో ఇవ్వడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కోసం ఆ శాఖ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రవీణ్ ప్రకాశ్ జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై ఆ ఆదేశాల్లో వివరించారు. ముఖ్యంగా భోజన ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చారు.
సాధారణంగా పైఅధికారులు వస్తుంటే జిల్లాస్థాయి అధికారులు రకరకాల ఫుడ్ ఏర్పాటు చేస్తుంటారు. నాన్ వెజ్ భోజనాన్ని సిద్ధం చేస్తుంటారు. ప్రవీణ్ ప్రకాశ్ కోసం ఇచ్చిన ఆదేశాల్లో మాత్రం హడావుడి, భారీ ఏర్పాట్లు వద్దని స్పష్టం చేశారు. నాన్ వెజ్ వంటకాలను అస్సలు తేవద్దని అధికారులకు స్పష్టత ఇచ్చారు. జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు స్కూళ్లను ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీ చేస్తారని వివరించారు.
ఉదయం 6 గంటలకు పార్లే లేదా క్రాక్‌జాక్ బిస్కెట్లతో టీ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 8 గంటలకు ఇడ్లీ, ఉల్లి దోశ లేక సాధారణ దోశను చట్నీతో పాటు ఉంచాలని, మధ్యాహ్నం 1.30కు చపాతి లేదా పుల్కాలను వెజ్ కర్రీతో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటలకు టీ-బిస్కెట్స్, ఒకవేళ రాత్రి అక్కడే ఉంటే చపాతి లేదా పుల్కాలను వెజ్ కర్రీతో సిద్ధం చేయాలని, ఆఖరిలో ఒక గ్లాస్ పాలను అందించాలని ఆదేశాల్లో వివరించారు.
పండ్లు, డ్రై ఫ్రూట్స్, నాన్‌వెజ్, పండ్ల రసాలు వంటి వాటిని సిద్ధం చేయవద్దని వివరించారు. మెనూ సింపుల్‌గానే ఉన్నప్పటికీ.. పలాన వాటిని సిద్దం చేయాలని ఆదేశాల రూపంలో ఇవ్వడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే పైఅధికారులు వస్తున్నారంటే అధికారులు లేనిపోని హడావుడి చేస్తూ...ఏం తింటారో అన్న ఉద్దేశంతో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్‌ను సిద్ధం చేసి వృథా చేస్తుంటారని.. దాన్ని నివారించేందుకు ముందుగానే ఈ సింపుల్ మెనూ చాలని స్పష్టత ఇచ్చిఉంటారని భావిస్తున్నారు.