Telugu Global
Andhra Pradesh

జగన్‌ పర్యటనల్లో ఈ తీరు సరికాదేమో!

ఇంతలో పల్నాడు జిల్లా వినుకొండలోనూ ప్రభుత్వ యంత్రాంగం అదే పనిచేసింది. వినుకొండ ఆర్టీసీ బస్‌స్టాండ్ రహదారి మధ్యలో ఏపుగా పెరిగిన చెట్లను రంపాల సాయంతో కోసేశారు.

జగన్‌ పర్యటనల్లో ఈ తీరు సరికాదేమో!
X

ఇప్పటికే ఏ చిన్న పొరపాటు జరిగినా జగన్‌పై టీడీపీ, సెక్ష‌న్ ఆఫ్‌ మీడియా విరుచుకుపడుతున్నాయి. సీఎం పర్యటనల సమయంలో ఈ ప్రచారం మరింత ఎక్కువగా ఉంటోంది. సీఎం భద్రత కోసం తీసుకునే జాగ్రత్తలనూ విమర్శిస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మీడియా వ్యవహారం ఉంటోంది. ఇందుకు పరోక్షంగా అధికారుల తీరు కూడా కారణమవుతోంది.

సీఎం వచ్చారంటే చెట్లు నరికేస్తారన్న అభిప్రాయం స్థిరపడే పరిస్థితిని తెచ్చారు. ఇటీవల జగన్ విశాఖ శారదాపీఠానికి వెళ్లాల్సి ఉంది. ఆ పర్యటన ఆఖరి నిమిషంలో రద్దయింది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. రహదారి వెంబడి మధ్యలో ఉన్న చెట్లను నరికేశారు. సీఎం వస్తే చెట్లు నరికేయడం ఏమిటని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డివైడర్‌ వెడల్పు చాలా తక్కువగా ఉంది.. చెట్లు పెద్దవి కావడంతో డివైడర్‌ దెబ్బతింటోంది.. అందుకే వాటిని నరికేశాం.. అక్కడ గడ్డిని పెంచుతాం.. చెట్ల నరికి వేతకు, సీఎం పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని విశాఖ కార్పొరేషన్ అధికారులు వివరణ ఇచ్చారు.

ఇంతలో పల్నాడు జిల్లా వినుకొండలోనూ ప్రభుత్వ యంత్రాంగం అదే పనిచేసింది. వినుకొండ ఆర్టీసీ బస్‌స్టాండ్ రహదారి మధ్యలో ఏపుగా పెరిగిన చెట్లను రంపాల సాయంతో కోసేశారు. కేవలం చెట్ల మొదళ్లు మాత్రమే మిగిల్చారు. ఒక్క ఆకు కూడా లేకుండా నరికేశారు. 50కిపైగా చెట్లను ఇలా నరికేశారు. ఈ పని కూడా ఈనెల 30న సీఎం జగన్ వినుకొండ వస్తున్న నేపథ్యంలోనే చేయడంతో విమర్శలు వస్తున్నాయి. సీఎం భద్రతా సిబ్బంది సూచన మేరకే చెట్లు కొట్టేస్తున్నామని మున్సిపల్ అధికారి వెంకయ్య చెప్పారు.

ప్రభుత్వం గుర్తించాల్సింది ఏమిటంటే.. ఇలా సీఎం వెళ్లిన ప్రతి చోట చెట్లు నరికేసుకుంటే వెళ్తే చాలా చెడ్డపేరు వస్తుంది. సీఎం పర్యటించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు కంటే..ఇలా చెట్లను నరికివేయడం వల్ల వచ్చే చెడ్డ పేరే అధికంగా ఉంటుంది. సీఎం భద్రతలో రాజీ పడకూడదు. ఒకవేళ భద్రతపరమైన ఇబ్బందులుంటే.. నేరుగా హెలికాప్టర్‌లో బహిరంగ సభ వేదిక వద్ద సీఎం దిగే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా కాకుండా చెట్లన్నీ నరికేసి రోడ్‌ షో చేయడాన్ని ప్రజలు హర్షించరు.

First Published:  29 Jan 2023 11:24 AM IST
Next Story