అమరావతిలో పేదల ఇళ్ళ కేటాయింపులకు తొలిగిన అడ్డంకులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారంనాడు ఆమోదం తెలిపారు. చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ ఈ రోజు గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాల కేటాయింపులకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలుచేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారంనాడు ఆమోదం తెలిపారు. చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ కార్యాలయం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది.
పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వై ఎస్ జగన్ ప్రభుత్వం ఈ సవరణలలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించడంతో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మార్గం సుగమమైంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణను చేశారు. పాలక వర్గంతో పాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా చట్టానికి సవరణ చేశారు.
దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.