Telugu Global
Andhra Pradesh

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణ పరిస్థితులు..

మెస్ లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సిబ్బంది ప్లేట్లు సరిగా కడగరు, పాత్రల పరిశుభ్రత కూడా అంతంతమాత్రమే. గ్రైండర్లను కడగకుండానే తిరిగి ఉపయోగిస్తున్నారని ప్రాథమిక పరిశీలనలో తేలింది.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణ పరిస్థితులు..
X

ఈనెల 23న నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ హాస్టల్ లో తొలిసారిగా ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. అదేరోజు కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు. 25వతేదీ ఆదివారం 165మంది ఆస్పత్రిపాలయ్యారు, ఆ తర్వాతి రోజు 229మంది అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లారు. మంగళ, బుధవారాల్లో 600మందికి పైగా ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. చివరకు మీడియా ద్వారా గుట్టురట్టయింది. వెయ్యిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను ప్రభుత్వం తీవ్రంగా మందలించింది.


మెస్ వద్ద అపరిశుభ్ర వాతావరణంతోపాటు, నాసిరకం ఆహారం, అది కూడా వికటించడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని కూడా నూజివీడు ప్రాంగణంలోనే నిర్వహిస్తుండటంతో ఇక్కడే అందరికీ వసతి, భోజనం ఏర్పాటు చేశారు. ఈనెల 23న ఆహారం పాడవడంతో అది తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. కనీసం అప్పుడైనా అధికారులు కళ్లుతెరవలేదు. ఆహార నాణ్యతను పట్టించుకోలేదు. దీంతో వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఆస్పత్రుల్లో విద్యార్థుల పేర్లు ఓపీల్లో చేర్చకుండా అక్కడ కూడా నాటకమాడారు. ఈ తప్పులన్నీ ఇప్పుడు బయటపడ్డాయి.


నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెస్ లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సిబ్బంది ప్లేట్లు సరిగా కడగరు, పాత్రల పరిశుభ్రత కూడా అంతంతమాత్రమే. గ్రైండర్లను కడగకుండానే తిరిగి ఉపయోగిస్తున్నారని ప్రాథమిక పరిశీలనలో తేలింది. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ ఘటన అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలకు కారణం అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి దారుణ పరిస్థితులున్నాయని, ఇప్పుడవి కొనసాగాయని, వాటిని చక్కదిద్దే బాధ్యత తమదేనంటోంది కూటమి ప్రభుత్వం. మంత్రులు లోకేష్, కొలుసు పార్థసారథి ఈ విషయంలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  29 Aug 2024 2:06 AM GMT
Next Story