Telugu Global
Andhra Pradesh

జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాం.. హెల్త్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు ఉంచలేరా..?

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తాము గౌరవించినప్పుడు, టీడీపీ కూడా వైఎస్ఆర్ ని గౌరవించాలని, హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాం.. హెల్త్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు ఉంచలేరా..?
X

ఏపీ కేబినెట్ నిర్ణయాల్లో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు కూడా ఉంది. వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని వైసీపీ నేతలంటున్నారు. తాము పేరు మార్చలేదని, వైసీపీ ప్రభుత్వం మార్చిన పేరుని పునరుద్ధరించామని, అసలు హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరే మొదట ఉన్నదనేది టీడీపీ వాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. వైసీపీ పేరు మార్చింది, టీడీపీ మళ్లీ పేరు మార్చుకుంది.. అనేది మాత్రం వాస్తవం.

ఇక వైసీపీ మరో లాజిక్ గుర్తు చేస్తోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్టీఆర్ కి సముచిత గౌరవం ఇచ్చింది వైసీపీయేనని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేవీ టీడీపీకి నచ్చనప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు కూడా మార్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తాము ఎన్టీఆర్ ని గౌరవించినప్పుడు, టీడీపీ వైఎస్ఆర్ ని కూడా గౌరవించాలని, హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని కూడా అంటున్నారు.

ఇక ప్రజల విషయానికొస్తే.. కూల్చివేతలు, పేరు మార్పులు.. ఇవన్నీ వారికి కొత్తవేం కాదు. అప్పుడూ చూశారు, ఇప్పుడూ చూస్తున్నారు. అప్పుడు కొత్త అనుకుంటే, ఇప్పుడది అలవాటైంది. ఇకముందు జరిగినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకుంటారని కూడా అనుకోలేం. పథకానికి పేరెవరిది ఉంది అని వారు ఆలోచించట్లేదు, ఏమేం పథకాలిస్తున్నారు, ఎంతమేర ఆర్థిక సాయం చేస్తున్నారనేదే వారికి ముఖ్యం. అందుకే కేవలం నవరత్నాలకు ప్రజలకు జై కొట్టలేదు, అంతకు మించి అని చంద్రబాబు చెబితే వారు నమ్మారు. ఆ నమ్మకం కాల పరిమితి ఐదేళ్లు. ఈ ఐదేళ్లు వైసీపీ ప్రజల్లో ఉంటూ వారి నమ్మకం చూరగొనే ప్రయత్నం చేస్తుందా, లేక కేవలం కళ్లు మూసుకుని కాలం గడిచే వరకు వేచి చూస్తుందా.. అనేది తేలాల్సి ఉంది.

First Published:  25 Jun 2024 7:58 AM IST
Next Story