Telugu Global
Andhra Pradesh

రంగంలోకి దిగుతున్న ఎన్ఆర్ఐలు

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగుతున్నారు.

రంగంలోకి దిగుతున్న ఎన్ఆర్ఐలు
X

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవటమే టార్గెట్‌గా విదేశాల్లోని అనేక రంగాల్లో స్థిరపడిన ప్రముఖులు నడుం బిగించారని సమాచారం. మామూలుగానే టీడీపీకి ఎన్ఆర్ఐల మద్దతు చాలా ఎక్కువగా ఉంటుంది. 2014, 19 ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రచారంలో కానీ ఆర్థికంగా కూడా చాలా చోట్ల ఎన్ఆర్ఐలు పార్టీ తరపున యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు.

అయితే గతంలో పనిచేయటం వేరు రాబోయే ఎన్నికల్లో పనిచేయటం వేరన్న విషయం వీళ్ళకి బాగా అర్థ‌మైందట. వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకమైనవన్న విషయాన్ని వీళ్ళు బాగా గుర్తించారు. అందుకనే ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా పార్టీని ఆదుకునేందుకు సిద్ధమైపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఐటి రంగం, మేనేజ్మెంట్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా డబ్బులు సంపాదించారు. అమెరికాతో పాటు బ్రిటన్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, స్టిట్జర్లాండ్, అరబ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలంతా ఏకమై పార్టీకి అండగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగానే విదేశాల్లో కూడా మినీమహానాడులు, ఎన్టీఆర్‌ జయంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించారు. విదేశాల్లో చదువుకుంటు, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని వారిని టీడీపీకి మద్దతిచ్చేట్లుగా పెద్ద క్యాంపెయినింగే జరుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటినీ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పర్యవేక్షిస్తోంది. ఎన్నికల ఖర్చులకు ఇబ్బందులు లేకుండా భారీఎత్తున విరాళాలు పోగుచేస్తున్నారు. ఈ విషయమై ఈ మధ్యనే టీడీపీలోని చాలామంది ప్రముఖులు కొన్ని దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

మినీమహానాడులో పాల్గొనేందుకే తాము విదేశాలకు వెళ్ళొచ్చినట్లు వీళ్ళు చెప్పుకున్నా అసలు విషయం నిధుల సమీకరణేనట. విదేశాల్లో కూర్చుని రాష్ట్రంలోని తమ ప్రాంతాల్లోని వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటు పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడి వాళ్ళు తమ సొంతూళ్ళకు చేరుకుని యాక్టివ్ రోల్ తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబుకు హామీ ఇచ్చారట. మొత్తానికి రాబోయేదే తన నాయకత్వంలో చివరి ఎన్నికలన్నట్లుగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

First Published:  24 Oct 2022 8:41 AM GMT
Next Story