Telugu Global
Andhra Pradesh

గుడివాడ టీడీపీలో ఎన్‌ఆర్‌ఐ - ఖరీదైన చీరల పంపిణీ

ఇతర సేవా కార్యక్రమాలను కూడా రాము పెద్దెత్తున నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి కూడా ఇతర వర్గాల మహిళలకు చీరల పంపిణీ చేయబోతున్నట్టు చెబుతున్నారు.

గుడివాడ టీడీపీలో ఎన్‌ఆర్‌ఐ - ఖరీదైన చీరల పంపిణీ
X

మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని టీడీపీ ఆశ పడుతోంది. ఇదే అదనుగా టీడీపీ టికెట్ కోసం కొత్త వ్యక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చూస్తుంటే గుడివాడ ఎన్నిక ఈసారి చాలా కాస్ట్‌లీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐ ఇప్పటికే పంపకాలు మొదలుపెట్టారు. దాంతో కొడాలి నాని, టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు కూడా డబ్బులు బయటకు తీయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

గుడివాడకు చెందిన వెనిగండ్ల రాము అమెరికాలో సాప్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నారు. ఆయన గుడివాడలోనే మరో సామాజికవర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు. దాంతో రెండు సామాజికవర్గాల బలంతో ఈసారి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే భారీగా డ‌బ్బు ఖర్చు చేస్తున్నారు.

క్రిస్‌మస్‌ వేడుకలను రాము అవకాశంగా తీసుకుంటున్నారు. చర్చిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్‌మస్ సందర్భంగా మహిళలకు ఖరీదైన చీరలను ఆయన పంపిణీ చేస్తున్నారు. 1500 రూపాయలకుపైగా విలువైన ఒక్కో చీర పంచేస్తున్నారు. గుడివాడ సెగ్మెంట్‌లో 300 చర్చిలు ఉండగా ఇప్పటికే 150 చర్చిల్లో ఈ పంపిణీ పూర్తి చేశారు. ప్రతి చర్చి పరిధిలో కనీసం 200 మంది మహిళలకు చీరలను కానుకగా ఇస్తున్నారు.

ఇతర సేవా కార్యక్రమాలను కూడా రాము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి కూడా ఇతర వర్గాల మహిళలకు చీరల పంపిణీ చేయబోతున్నట్టు చెబుతున్నారు. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. బాగా డబ్బున్న ఈ ఎన్‌ఆర్‌ఐ తీరుతో అటు కొడాలి, ఇటు రావి వెంకటేశ్వరరావు కూడా ఈ ఉచిత పంపిణీలు ప్రారంభించకతప్పడం లేదు. రావి వెంకటేశ్వరరావు కూడా కొద్దిరోజులుగా చీరల పంపిణీ చేస్తున్నారు. కొడాలి నాని ఆదివారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఆయన కూడా చీరలు పంపిణీ చేస్తారని చెబుతున్నారు.

సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన ఎన్‌ఆర్‌ఐ రాము.. టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలకు స్వీట్‌ బాక్స్‌లు పంపిస్తున్నారు. మరి టీడీపీ టికెట్‌ రావికి దక్కుతుందో.. రాముకు దక్కుతుందో చూడాలి.

First Published:  18 Dec 2022 10:11 AM IST
Next Story