Telugu Global
Andhra Pradesh

మళ్లీ నోటీసులు.. వైసీపీ ఆఫీస్ లన్నీ కూల్చేస్తారా..?

వైసీపీ ఆ నోటీసుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

మళ్లీ నోటీసులు.. వైసీపీ ఆఫీస్ లన్నీ కూల్చేస్తారా..?
X

ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. దాడులతో మొదలై, ఇప్పుడు విధ్వంసం వద్దకు చేరాయని వైసీపీ ఆరోపిస్తోంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేసిన తర్వాత జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆఫీస్ లపై కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం తీవ్ర ఆరోపణలు చేసింది. అవన్నీ అక్రమ కట్టడాలని, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అనుమతి లేని కట్టడాలని చెప్పింది. ఈ క్రమంలో విజయవాడ, విజయనగరంలోని వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.


ఆమధ్య అనకాపల్లి కార్యాలయానికి ఇచ్చిన నోటీసుల్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చించివేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ, విజయనగరంలోని కార్యాలయాలకు అనుమతి లేదంటూ ఆయా పాలక సంస్థలు నోటీసులివ్వడం సంచలనంగా మారింది. ఇది దుర్మార్గమంటూ వైసీపీ ఆ నోటీసుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

జనం తిట్టిపోస్తున్నారు..!

ఈ విధ్వంస రాజకీయాలను చూసి జనం తిట్టిపోస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అతి తక్కువకాలంలోనే జనం వైసీపీ వైపు వచ్చేస్తారని చెబుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి నిర్మాణాలకోసం జీవో ఇచ్చారని, వాటి ప్రకారం ఆ పార్టీ కార్యాలయాలను కట్టుకున్నారని, అదే విధంగా వైసీపీ చేసిన, చేస్తున్న నిర్మాణాలను మాత్రం తప్పుబడుతున్నారని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని జనం ఛీకొట్టే రోజు దగ్గర్లోనే ఉందంటున్నారు వైసీపీ నేతలు.

First Published:  25 Jun 2024 12:36 AM GMT
Next Story