ఏపీలో విద్యా సంస్కరణలకు నోబెల్ అవార్డు గ్రహీత ఫిదా
విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని ఆయన ప్రశంసించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు, అమలు చేస్తున్న తీరు చూసి నోబెల్ అవార్డు గ్రహీత, చికాగో యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్ట్ క్రెమెర్ ఫిదా అయ్యారు. గురు, శుక్రవారాల్లో ఏలూరు జిల్లాలోని పెదపాడు, దెందులూరు, భీమడోలు మండలాల్లోని పలు జెడ్పీ హైస్కూళ్లను తన బృందంతో కలసి సందర్శించిన క్రెమెర్.. ఏపీలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, విద్యా వికాసానికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తీసుకుంటున్న శ్రద్ధ చూసి ప్రశంసల జల్లు కురిపించారు.
విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని చూసి క్రెమెర్ ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని ఆయన ప్రశంసించడం గమనార్హం. డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రెమెర్.. ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్లముందు కనిపిస్తున్న ఓ అద్భుతమని ఏపీ సర్కార్ పనితీరును కొనియాడారు.
పాఠశాలల సందర్శన సందర్భంగా క్రెమెర్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన చేయడాన్ని చూసి.. వాటి పనితీరు, విద్యార్థులు వాటిని వినియోగిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుకతో పాటు బూట్ల నుంచి బ్యాగుల వరకు అన్ని సౌకర్యాలూ ప్రభుత్వమే కల్పించడం ద్వారా విద్యార్థుల పురోభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి ప్రోత్సాహకర వాతావరణంలో విద్యనభ్యసించే విద్యార్థులు తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారని స్పష్టం చేశారు. ఇది ఒకేసారి కనబడే ఎదుగుదల కాదని, భవిష్యత్తులో దీని ఫలాలు తప్పక సమున్నతంగా ఉంటాయని చెప్పడం గమనార్హం.
*