Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఎవరిదారి వారిదే.. పవన్ కంటే ముందే బస్సెక్కిన బీజేపీ నేతలు

పవన్ కల్యాణ్ కంటే ముందుగానే బీజేపీ బస్సు యాత్ర మొదలు పెట్టింది. పవన్ యాత్రకి, ఈ బస్సుకి సంబంధం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రతిపక్షాలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి.

ఏపీలో ఎవరిదారి వారిదే.. పవన్ కంటే ముందే బస్సెక్కిన బీజేపీ నేతలు
X

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతుంటారు. పవన్ తో పొత్తు పెట్టుకుని కాస్తో కూస్తో మైలేజీ పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ. ఈ రెండు పార్టీలను మచ్చిక చేసుకుని తన అసమర్థతను కప్పి పుచ్చుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు. అందరికీ అందరూ కావాలి. కానీ ఎవరి ప్రయత్నాలు వారు విడివిడిగా మొదలు పెట్టారు.

చంద్రబాబు ఆల్రడీ సిట్టింగ్ లకే సీట్లు అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే పొత్తు ఉన్నా కూడా ఆ 19 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఛాన్స్ లేదనమాట. ఇక పవన్ దసరా సందర్భంగా బస్సు యాత్రకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉండేలా తన బస్సుని డిజైన్ చేయించుకుని సినిమాటిక్ గా ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈలోగా బీజేపీలో చురుకు పుట్టింది. ఏపీలో బీజేపీ వీధి సభల పేరుతో కొత్త కాన్సెప్ట్ ని తెరపైకి తెచ్చింది. ప్రతిరోజూ, ప్రతి గల్లీలో బీజేపీ సభలు పెట్టి ప్రజలకు చేరువ కావాలనేది వారి కాన్సెప్ట్. అక్టోబర్ 2 లోపు ఏపీలో 5 వేల సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రజాపోరు యాత్రని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలు పెడుతున్నారు. తాజాగా విశాఖలో ఆయన ప్రజా పోరు యాత్రని ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ కంటే ముందుగానే బీజేపీ బస్సు యాత్ర మొదలు పెట్టింది. పవన్ యాత్రకి, ఈ బస్సుకి సంబంధం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రతిపక్షాలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. పైకి మాత్రం వైసీపీని ఉమ్మడిగా ఓడిస్తామని బీరాలు పలుకుతున్నాయి. ఏపీలో కేంద్ర మంత్రులు వచ్చినా బీజేపీ సభలను ఎవరూ పట్టించుకోరు. అలాంటిది గల్లీలో బీజేపీ నేతలు కాషాయ కండువా కప్పుకుని మీటింగ్ పెడితే జనాలు వస్తారా..? డబ్బులిచ్చి జనసమీకరణ చేసినా, వారు ప్రసంగం మొదలు పెట్టగానే వెళ్లిపోతారు. కానీ బీజేపీ మాత్రం హడావిడి చేయాలని చూస్తోంది. విశాఖలో బస్సు యాత్రకు జెండా ఊపిన సోము వీర్రాజు అక్టోబర్ 2 వరకు బస్సుయాత్ర జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 5వేల సభలు పెడతామంటున్నారు. పవన్ కంటే ముందు బస్సెక్కిన బీజేపీ నేతల్ని ప్రజలు ఏమేరకు స్వాగతిస్తారో చూడాలి.

చివరగా ఒక వార్త... అక్టోబర్ 5న తాను తలపెట్టిన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

First Published:  18 Sept 2022 5:30 PM IST
Next Story