Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోం : బిజెపి ఏపీ ఇన్ చార్జి సునీల్ ధియోధర్ స్ప‌ష్టీక‌ర‌ణ

ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసింది బీజేపీ. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోం : బిజెపి ఏపీ ఇన్ చార్జి సునీల్ ధియోధర్ స్ప‌ష్టీక‌ర‌ణ
X

ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)తో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభ‌వాల‌ను చవిచూశామని చెప్పారు. ఢిల్లీలో సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడారు.

ఏపీలో టిడిపి, వైఎస్సార్‌సీపీ లు రెండూ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీల‌ని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల‌కు వ్య‌తిరేకంగా బిజెపి పోరాడుతుంద‌న్నారు. 'అవినీతి ర‌హిత‌..అభివృద్ధి స‌హిత పార్టీయే బిజెపి' అని సునీల్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల‌కి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఉద్ఘాటించారు. పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ అంశంపై తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్డు మ్యాప్‌పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. క‌న్నా వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఇప్ప‌టికే స్పందించార‌ని చెప్పారు. రాష్ట్ర బిజెపిలో ఎటువంటి సంక్షోభం కానీ, విభేదాలు కానీ లేవ‌ని చెప్పారు.

విశాఖ ఘ‌ట‌న‌లు, ఆ త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. అదే త‌రుణంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ కావ‌డంతో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఆ వెంట‌నే హ‌డావిడిగా బిజెపి నేత‌లు స్పందించ‌డం మొద‌లు పెట్టారు. ఆ సంద‌ర్భంలోనే సునీల్ దేవధ‌ర్ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని, బిజెపి-జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతుంద‌ని చెప్పారు. వైసీపీ, టీడీపీలు రెండూ దొంగల‌ పార్టీలేనని విమర్శించారు.

First Published:  22 Oct 2022 4:45 PM IST
Next Story