అంబటి టికెట్‌కు ఎసరు..? - చిట్టా విజయభాస్కర్ రెడ్డి సంచలన ప్రకటన
మంత్రి అంబటిపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ను పొగుడుతూ భజన చేస్తే సరిపోదని.. పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌కు ఎసరు వచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన అంబటి .. గత ఎన్నికల్లో సత్తెనపల్లిలో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకు స్థానిక వైసీపీ నేతలు సహకరించారు. కానీ, ప్రస్తుతం అంబటికి తన నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తున్నట్టు కనిపిస్తోంది. ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన చిట్టా విజయభాస్కర్ రెడ్డి.. వైఎస్సార్ ఆత్మీయ సమావేశం పేరుతో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులందరినీ పిలిపించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి అంబటిపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ను పొగుడుతూ భజన చేస్తే సరిపోదని.. పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాక తాను 34 ఏళ్లు కష్టపడి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నానని.. వచ్చే ఎన్నికల్లో ప్రాణాలకు తెగించైనా టికెట్ సంపాదించుకుంటానన్నారు.
కాగా, విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో చిచ్చు పెట్టాయి. నియోజవకర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందంటూ వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటుండటం గమనార్హం. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇస్తారు..? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో చాలా రోజులుగా వైసీపీ క్యాడర్‌లో అసంతృప్తి ఉందని.. ఇవాళ అది బయటపడిందన్న టాక్ వినిపిస్తోంది.
చిట్టా విజయభాస్కర్ రెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. మరి అంబటి రాంబాబు ఆయనను దూరం పెట్టడంతో ప్రస్తుతం ఏకు మేకు అయ్యారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీలో అంతర్గతంగా ఎంత కుమ్ములాటలు ఉన్నా.. ఎవరూ పెద్దగా బయటపడేవారు కాదు. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కరూ తమ అసంతృప్తిని బాహాటంగానే బయట పెడుతుండటం గమనార్హం. ఆ పరిణామాలను వైసీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.